ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. నిన్నటి నుంచి ఆయుష్ బృందం నెల్లూరులోనే వుంది. రేపు సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరుకు చేరుకోనుంది. సోమవారం నాడు రెండు బృందాలు ఆనందయ్య మందు తయారీనీ పరిశీలిస్తాయి.

అనంతరం శాంపిల్స్‌ను తీసుకెళ్తాయి. ఈ రెండు బృందాల నివేదిక ఆధారంగా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీపై నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం నుంచి అధికారుల ఆధీనంలోనే వున్నారు ఆనందయ్య. ఆనందయ్య మందు తయారీని నిన్నటి నుంచి నిలిపివేశారు అధికారులు.

Also Read:ఆనందయ్య కరోనా మందు: క్షీణించిన హెడ్‌మాస్టర్ కోటయ్య ఆరోగ్యం

అలాగే ఆనందయ్య మందు తయారీకి వాడే పాత్రలను కూడా నెల్లూరు తరలించారు. మందు తయారీ నిలిపివేసినప్పటికీ శనివారం కూడా భారీగా కరోనా రోగులు కృష్ణపట్నం వచ్చారు. సీరియస్‌గా వున్న కొంతమందికి కంటిలో డ్రాప్స్ వేశారు ఆనందయ్య అనుచరులు. 

మరోవైపు, బొనిగె ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు శుభవార్త చెప్పారు. మందు తయారీలో వాడే పదార్థాలన్నీ శాస్త్రీయంగానే ఉన్నాయని, మందు తయారీ పదార్థాలపై ల్యాబ్ నుంచి పాజిటివ్ నివేదిక వచ్చిందని ఆయన చెప్పారు. ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో పరిశీలిస్తామని రాములు చెప్పారు. ఆనందయ్య కరోనా మందుపై రాములు ఆధ్వర్యంలోనే అధ్యయనం జరుగుతోంది.