అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆళ్లగడ్డ వద్ద జరుగుతున్న యురేనియం నిక్షేపాల అన్వేషణ పనులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యాదవడలో జరుగుతున్న యురేనియం డ్రిల్లింగ్ పనుల ఫోటోను పోస్టు చేసి ఏమిటిది అని ప్రశ్నించారు? దీనికి జగన్ సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

ఈ ఫొటోతోపాటు నల్లమల పరిరక్షణ కొరకు విమలక్క పాడిన పాటను కూడా పోస్ట్ చేసి పాటను మెచ్చుకున్నారు. ఈ పాట చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు, యురేనియం పై పోరాటానికి జనసేన ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. 

నిన్న ఇదే విషయమై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆ సర్వే చేస్తున్న సూపెర్వైజర్ పై, ఆ ప్రాంత తహశీల్ధార్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతులు లేకున్నా సర్వే చేస్తున్నారని అన్నారు. తహసీల్దారు పనులను ఇన్ని రోజులు ఆపకుండా, తాను పరిశీలనకు రాబోతున్నానని తెలిసి నిన్ననే ఆపారని ఫైర్ అయ్యారు.