రానున్న ఎన్నికల్లో.. తాను కూడా పోటీ చేస్తానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ప్రకటన రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తమ బలమెంతో అంత వరకే పోటీ చేస్తానని పవన్ పేరుతో సోమవారం ట్వీట్ వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ ఏపిలో మాత్రం పోటీ చేస్తానన్నట్లుగా మాట్లాడిన పవన్.. తాజా ట్వీట్లో మాత్రం తెలంగాణాలో కూడా పోటీ చేస్తానని చెప్పటం గమనార్హం. అంటే మొత్తం 294 స్ధానాలకు గాను జనసేన పోటీ చేసేది కేవలం 175 సీట్లు మాత్రమే అన్న విషయంలో స్పష్టత ఇచ్చారు.

అయితే.. నిన్న మొన్నటి వరకు జనసేన తమకు అండగా ఉందని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ పవన్ స్వయంగా రాజకీయాల్లో పోటీ చేస్తానని  మరోసారి చెప్పడంతో టీడీపీలో కలకలం మొదలైంది. ఇదిలా ఉంటే.. పవన్.. రెండు రాష్ట్రాల్లో కలిపి 175 సీట్లలో పోటీ చేస్తానని చెబుతున్నారు. అంటే.. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల స్థానాలు.. ఏపీతో  పోలిస్తే.. తక్కువ కనుక.. తెలంగాణలో 75 స్థానాల్లో.. ఏపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తారనుకుందాం. తెలంగాణలో జనసేన పోటీ చేసినా పెద్దగా ఉపయోగం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కనుక పవన్ మొయిన్ టార్గెట్ ఏపీ అనే చెప్పాలి. ఇప్పటికే ఏపీలో.. మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు.. ఈసారైనా  సీఎం కుర్చీ ఎక్కాలని జగన్ ఎదురు చూస్తున్నారు. మరి పవన్ ఈ  ఎన్నికల్లో పోటీ చేయడం వలన ఓట్ల చీలిక తప్పదు. దాని వల్ల ఎవరికి నష్టం కలగబోతోంది. జగన్? చంద్రబాబు కా?

గత ఎన్నికల్లో పవన్, మోదీ, బీజేపీ మద్దతు ఉన్నప్పటికీ టీడీపీ కేవలం 1.6శాతం ఓట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ ఒంటరి పోరాటం చేసి ఏపీలో మొత్తం 68స్థానాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంటే.. ఈ ఎన్నికల్లోనూ ఆయనకు అటూ ఇటుగా 68 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అయితే.. జనసేన పోటీ చేయబోయే స్థానాల్లో జగన్ కచ్చితంగా గెలుస్తాడు అనే స్థానాలు కూడా ఉంటాయి. అప్పుడు.. ఓట్లు చీలి..జగన్ కి రావాల్సిన కొన్ని స్థానాలు పవన్ పార్టీకి చేరే అవకాశం ఉంది. అటు ఇటుగా చంద్రబాబుకి దీని వల్ల కొన్ని ఓట్లు తగ్గినా.. పెద్దగా నష్టం ఉండదు. కానీ జగన్ కి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఇక మరో కోణంలో ఆలోచిస్తే.. గత ఎన్నికల్లో పవన్ మద్దతు కారణంగా చాలా మంది కాపులు చంద్రబాబుకి ఓట్లు వేశారు. ఇప్పుడు పవన్ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగుతున్నారు. అలాంటప్పుడు ఇంకా కాపులు చంద్రబాబుకి మద్దతుగా నిలుస్తారా? అలా కాదని పవన్ వైపే మొగ్గు చూపితే.. చంద్రబాబుకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే.. ఈ అంశం జగన్ కి కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రెండింటిలో ఏది జరిగినా.. చంద్రబాబు, జగన్ లో ఎవరో ఒకరికి నష్టం కలిగే అవకాశం ఉంది.

కాకపోతే.. ఇదంతా పవన్ చిత్తశుద్ధితో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తేనే. ఎందుకంటే.. ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లో పాల్గొనడం లేదు. రెండు పడవల ప్రయాణం లాగా.. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఈ జనసేన మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుందనే ప్రచారం కూడా ఉంది. కాబట్టి ప్రజలు.. చంద్రబాబు, జగన్ ని కాదని.. పవన్ వైపు మొగ్గు చూపుతారా? తుది నిర్ణయం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది.