Asianet News TeluguAsianet News Telugu

పొత్తులపై స్పందించిన Pawan Kalyan.. పార్టీ శ్రేణులతో ఆయన ఏం చెప్పారంటే..

రాజకీయ పొత్తుల అంశంపై స్పందించిన జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దని ఈ సందర్భంగా పవన్ పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు. 
 

Pawan Kalyan sensational comments on political alliances
Author
Hyderabad, First Published Jan 11, 2022, 9:00 PM IST

రాజకీయ పొత్తుల అంశంపై స్పందించిన జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని పవన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జనసేనాని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చని.. పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దని నిర్దేశించారు. 

జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని పవన్ అన్నారు. పార్టీ శ్రేణులందరూ ఒకే మాట మాట్లాడుదామని చెప్పారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లనని.. అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకు వెళ్లనున్నట్టుగా తెలిపారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. 

పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోందన్నారు. పార్టీ నిర్మాణం అనేది కష్టమైనదని అన్నారు. సంస్థాగత నిర్మాణం లేదని చెబుతున్నవారు.. ఎవరూ పార్టీని స్థాపించలేదని అన్నారు. చిన్నపాటి సంస్థను నడిపించలేని వ్యక్తులే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.  జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయమని చెప్పారు. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామంటే సామాన్య విషయం కాదని తెలిపారు.

‘ఈ రోజు ఏ మూలకు వెళ్లినా ఒక జనసేన జెండా రెపరెపలాడుతుంది. దేశ భవిష్యత్తుకి యువతే నావికులని చెబుతారు. అలాంటి యువత మనవెంట బలంగా ఉన్నప్పుడు ఆ బలాన్ని మనం చూడగలగాలి. సంస్థాగతంగా, రాజకీయంగా మలచుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. పార్టీ స్థాపించిన ఏడేళ్ల తర్వాత యువత ఈ రోజుకి నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఆ యువత మీ వెంట నిలబడతామన్న ధైర్యం నింపితే ఈ రోజుకి  రాష్ట్రవ్యాప్తంగా 676 మండలాలకుగాను  403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నాం. అలా వేయగలిగామంటే యువత, జనసైనికులు, వీర మహిళలే మన బలం. ఈ బలాన్ని  మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ ఏడాది లోపే సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు నిర్మాణం చేసుకుందాం’ అని పవన్ పార్టీ  కార్యనిర్వాహక సభ్యులతో చెప్పారు. 

పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కమిటీ
‘గత సంవత్సరం  కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఆ సభను ఘనంగా జరుపుకోవాలన్నది నా ఆకాంక్ష. దాని కోసం అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆవిర్భావ సభను ముందుకు ఎలా తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్దాం. ఆ ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే అంశాలను ఒక ఆలోచనతో ముందుకు తీసుకువెళ్దాం’ అని పవన్ పేర్కొన్నారు. 

ప్రజా సమస్యల పోరు
ఏడాది పొడుగునా రైతుల కోసం పార్టీ శ్రేణులు వివిధ స్థాయిల్లో చేసిన పోరాటానికి పవన్ కల్యాణ్ పేరుపేరున ధన్యవాదాలు చెప్పారు. ‘వరి, మిర్చి రైతులకు, తుపానుల వల్ల పంటను కోల్పోయిన రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం నుంచి వారికి జరిగిన నష్టానికి పరిహారం ఎలా ఇప్పించాలి.. అందుకు ఏం చేయాలి అనే దాని మీద పార్టీ వద్ద ఒక బలమైన ప్రణాళిక ఉంది. ఈ నెలలో రైతాంగం కోసం చేసే పోరాటాన్ని ధర్నాల రూపంలో ముందుకు తీసుకువెళ్దామని భావించాం. కోవిడ్ వల్ల దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాం. ఆ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచన చేద్దాం. జాబ్ క్యాలెండర్, ఇతర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకువెళ్దాం, ఏ విధంగా పోరాడాలి అనే అంశంపై సంక్రాంతి తరవాత ఒక సమావేశం నిర్వహించుకుని ముందుకు వెళ్దాం. అందరి సలహాలు సూచనల మేరకు మరో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జిల్లాల పర్యటనలు, ప్రతి నియోజకవర్గం ప్రజలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేద్దాం’ అని పవన్ తెలిపారు. 

ఇటీవల జనసేనతో పొత్తు అంశంపై స్పందించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వన్ సైడ్ లవ్ కరెక్ట్ కాదన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ పొత్తలపై విస్తృతమైన చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన వైఖరిపై స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios