శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయం కోరారు. ఆ సాయం తన కోసం కాదు, తిత్లీ తుఫాను బాధితుల కోసం. గత రెండు రోజులుగా ఆయన తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. గురువారం వజ్రకొత్తూరు మండలంలో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
సిక్కోలు ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది పాతిక కిలోల బియ్యం కాదు.. పాతికేళ్ల భవిష్యత్ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ సాయాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన కోరారు. కరెంట్, మంచినీరు ఇచ్చేసి జిల్లాలో పరిస్థితులు బాగున్నాయని బయట ప్రచారం చేస్తున్నారని, కానీ ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన అన్నారు.
 
కేరళకు వరదలు వస్తే అందరూ సందర్శించారని, శ్రీకాకుళానికి తుఫాను వస్తే ఎవరూ రాలేదని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు. తుఫాను నష్టాన్ని త్వరలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఉద్దానంలో ఇంకా కరెంటు రాలేదని, కావాలంటే అధికారులను పంపించి క్రాస్ చెక్ చేసుకోవాలని ఆయన అన్నారు. 

ఏదో ఒకరోజు చూసి పోవటానికి తాను ఇక్కడికి రాలేదని, సమస్యలపై క్షేత్రస్థాయిలో తెలుసుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి వెళతానని చెప్పారు. ఓట్ల కోసం కాదు.. సాయం చేయాలనే శ్రీకాకుళం వచ్చానని ఆయన చెప్పారు.

తాను ప్రభుత్వాన్ని నిలబెట్టానని, అందుకే ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నానని ఆయన అన్నారు. అధికార పార్టీ నేతలెవ్వరూ గ్రామాలకు రాకపోయినా తాను వచ్చానని చెప్పారు. ఉద్దానం కిడ్నీ సమస్యను ఏ విధంగా ప్రపంచానికి తెలియజేశానో తుఫాను నష్టాన్ని కూడా అదే విధంగా తెలియజేస్తానని అన్నారు.