గుంటూరు: భీమవరంలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసిందని, శాసనసభలో తాను అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ఆ పనిచేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని, ఒక్క ఓటమి తమ పార్టీని నిలువరించబోదని ఆయన అన్నారు. 

తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ  కార్యాలయంలో శనివారం  పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

తన జీవితం రాజకీయాలకు అంకితమని, తన శవాన్ని నలుగురు మోసుకువెళ్లే వరకు తాను జనసేనను మోస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు ఓటమి కొత్త కాదని, దెబ్బతినే కొద్దీ ఎదిగే వ్యక్తిని అని ఆయన అన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పరాజయం ఎదురైతే తట్టుకోగలనా లేదా అని తనను తాను పరీక్షించుకున్న తర్వాతనే పార్టీ పెట్టానని అన్నారు. 

ఈవీఎంల అక్రమాలు, ధన ప్రలోభం వంటివి తాజా ఓటమికి కారణాలుగా చెబుతున్నారని, వీటన్నింటినీ తాను పట్టించుకోబోనని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పాలన ఎలా ఉంటుందో చూద్దామని అన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ జనసేన గుర్తు కనబడాలని, ప్రజలకు మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలనిఆయన అన్నారు. 

ఈ పార్టీ కార్యాలయం అందరిదని, ఎవరు ఎప్పుడయినా రావచ్చునని, అందరినీ కలిసేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తానని చెప్పారు. పంచాయతీ, జడ్పీ, పురపాలక ఎన్నికల్లో దీటుగా పోరాడదామన్నారు.