జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి తెరవెనక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి తెరవెనక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. బస్సు యాత్రలో భాగంగా పవన్ వినియోగించేందుకు జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా సిద్దం చేస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఒకటి, రెండు సినిమా కమిట్‌మెంట్స్ ఉండటం వల్ల బస్సు యాత్ర ఉంటుందా? లేదా? అనే చర్చ కూడా సాగుతుంది. అయితే తాజాగా తన బస్సు యాత్రపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. 

బస్సు యాత్ర కోసం సిద్దం చేసిన వాహనానికి సంబంధించిన ఫొటోలను పవన్ కల్యాణ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అలాగే ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ వాహనం ట్రయల్ రన్‌ను పవన్ బుధవారం హైదరాబాద్‌లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఇచ్చారు. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను చర్చించారు. 

Scroll to load tweet…

ఇక, వారాహి ఎన్నికల సమరానికి సిద్ధమైందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. యాత్ర కోసం వినియోగించే వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టారు. వారాహి అమ్మవారంటే.. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అయితే పవన్ ఎప్పటినుంచి బస్సు యాత్రను ప్రారంభిస్తారు?, కంటిన్యూ‌గా బస్సు యాత్ర నిర్వహిస్తారా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.