Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఒప్పందం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద వైసీపీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Pawan Kalyan made agreement with Chandrababu, C Ramachanadraiah accused
Author
Amaravati, First Published Sep 28, 2021, 8:05 AM IST

అమరావతి: రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. టీడీపీతో పవన్ కల్యాణ్ లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, దాంతో జగన్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు. 

ఆ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల విషయాన్ని అడ్డం పెట్టుకుని పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు, ఆయన అపరిపక్వ , అపసవ్య ఆలోచనా విధానానికి, అవగాహనాలేమికి అద్దం పడుతున్నాయని రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని చాలా కాలంగా సినీ పరిశ్రమ నుంచి వినతులు వస్తున్నాయని ఆయన చెప్పారు. 

Also Read: వైసీపీ విమర్శలకు పవన్ కౌంటర్: జగన్ పార్టీపై జనసేనాని సెటైర్లు

ఆన్ లైన్ లో ఉన్న పారదర్శకతను, ప్రేక్షకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధానానికి ప్రభుత్వం మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు. దాన్ని సినీ పెద్దలు బహిరంగంగానే స్వాగతించారని ఆయన చెప్పారు. కొందరు మాత్రం బ్లాక్ మార్కెటింగుకు, అడ్డగోలు సినిమా టికెట్ల ధరల పెంపునకు అడ్డుకట్ట పడుతుందనే దుగ్ధతో జగన్ మీద విషం కక్కుతున్నారని ఆయన అన్నారు.

పవన్ కల్యాణ్ రోజు రోజుకూ న్యూసెన్స్ వాల్యూగా తయారవుతున్నారని ఆయన అన్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, పరస్పర విరుద్ధమైన విధానాలను అవలంబించడం పవన్ కల్యాణ్ కు పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. 

వామపక్షాలతో చెట్టాపట్టాలు వేసుకుని నెలల వ్యవధిలోనే బిజెపి గూటికి చేరడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదని రామచంద్రయ్య అన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని తెలిపే పవన్ కల్యాణ్ తనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలను పవన్ కల్యాణ్ పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 

ఆన్ లైన్ టికెట్ విధానం వల్ల ఉండే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదని ఆయన పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో చేతులు కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని రామచంద్రయ్య అన్నారు. తెర మీద హీరోగా, రాజకీయాల్లో విలన్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్నారని ఆయన అన్నారు. 

Also Read: జగన్‌తో పోల్చుకోకు, ఎప్పుడు ప్రశ్నించాలో తెలియదు: పవన్ కళ్యాణ్ పై పోసాని ఫైర్

పవన్ కల్యాణ్ కు 2019లో చెల్లింపులు చేసే విషయంలో చంద్రబాబు, లోకేష్ మధ్య విభేదాలు తలెత్తాయని టీడీపీ వర్గాలే వెల్లడించడం ప్రజలు మరిచిపోలేదని ఆయన అన్నారు. ప్రజలు పవన్ కల్యాణ్ ను సరిగ్గా అర్థం చేసుకున్నారు కాబట్టే రెండో చోట్ల కూడా ఓడించారని, సమయం రాగానే మరోసారి ప్రజలు పవన్ కల్యాణ్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios