ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఆచంట ఉమేష్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఆచంట ఉమేష్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కిలిమంజారో శిఖరాగ్రం అయిన ఉహురు పీక్ లో జాతీయ జెండాను ఎగురవేసినందుకు చాలా ఆనందం కలిగిందని పవన్ తెలిపారు.

'ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని' అనే కవి వాక్కులను ఉమేష్ నిజం చేశారని ఆయన కొనియాడారు. ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించిన ఉమేష్ హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉమేష్‌ను పవన్ శాలువతో సత్కరించారు. పర్వతారోహణ కోసం తీసుకున్న శిక్షణ, కిలిమంజారో దగ్గరి వాతావరణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాజమండ్రికి చెందిన ఉమేష్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడని, పర్వతారోహణలో ప్రత్యేక శిక్షణ పొందారని తెలిపారు.

ఈ నెల 20న మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని ఆధిరోహించాడని తెలిసి సంతోషించానని చెప్పారు. పర్వత శిఖరాగ్రానికి చేరుకోవడానికి దాదాపు ఆరు రోజులు పడుతుందని.. ఈ ప్రయాణం అత్యంత కష్టమైనదని పవన్ అన్నారు.

అనేక అడ్డంకులు అధిగమించి ఉహురు పీక్ కు చేరుకోవడం అద్భుతమని పవన్ ప్రశంసించారు. పర్వతారోహణ అనేది అత్యంత కష్టమైనది... వాతావరణంలోని మార్పులను తట్టుకొని పర్వతాన్ని ఆధిరోహించాలని చెప్పారు.

ఈ సమయంలో మనం ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు వెళ్లడం మన మీద మనం సాధించే విజయమని పవన్ వ్యాఖ్యానించారు. ఉమేష్ భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధించాలని పవన్ ఆకాంక్షించారు. త్వరలోనే మౌంట్ ఎవరెస్టును కూడా ఆధిరోహించి, తెలుగువారందరికీ సంతోషం కలిగించాలని పవన్ కల్యాణ్ అభిలషించారు.