Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ కళ్యాణ్‌కు వెన్ను సంబంధిత సమస్య... ఆ పని కూడా మానేశారట

వేద పండితుల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వారాహి దీక్ష, సూర్యారాధనలు చేస్తున్నారు. ఆర్ష ధర్మం, సనాతన సంస్కృతి పట్ల అత్యంత గౌరవం, శ్రద్ధతో పూజాధికాలు నిర్వహిస్తున్నారు.

Pawan Kalyan has a Back problem GVR
Author
First Published Jul 4, 2024, 7:33 PM IST | Last Updated Jul 4, 2024, 7:33 PM IST

విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. 

ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్... అందులో భాగంగా సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై... వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణం గావించారు. 

అయితే, పవన్ కళ్యాణ్ గతంలో నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు. వెన్ను సంబంధిత ఇబ్బందితో కొద్ది కాలంగా సూర్య నమస్కారాలు చేయడం సాధ్యం కావడం లేదు. అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా నిర్వర్తించారు.

Pawan Kalyan has a Back problem GVR

భారతీయ సంస్కృతిలో భాగం...
వారాహి ఏకాదశ దిన దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేపట్టిన సూర్యారాధన సందర్భంగా.. వేద పండితులు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ ఈ ఆరాధన విశిష్టతను వివరించారు. 
“సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేయాలి. మన ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు. మన పురాణేతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన ఉంది. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోంది. 
శ్రీ మహా విష్ణువు సూర్యభగవానుడి నుంచి చక్రాయుధాన్ని పొందాడు. ఆరోగ్యానికి సైతం సూర్యారాధన మేలు చేస్తుంది. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయింది. కానీ మన సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉంది. రవి వారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారు. అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా అనవచ్చని వేద పండితులు తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌ వారాహి దీక్ష, సూర్యారాధనలు బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ పూజల గురించి వారు వివరిస్తూ “ఆర్ష ధర్మం, సనాతన సంస్కృతి పట్ల అత్యంత గౌరవం, శ్రద్ధ పవన్ కళ్యాణ్‌లో ఉన్నాయని తెలిపారు. మహర్షిప్రోక్తమైన మంత్ర విధానంతో పూజాదికాలు నియమనిష్టలతో సాగుతున్నాయని... సకల వర్గాల ప్రజల మేలును ఆయన ఆకాంక్షించారని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios