Asianet News TeluguAsianet News Telugu

అవసరమైతే కుత్తికోసుకుంటా కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టను:పవన్ కళ్యాణ్

తెలుగుదేశం, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధికారమే పరమావధిగా నీచ రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆ ఆగ్రహాన్ని 2019 ఎన్నికల్లో చూపిస్తారని స్పష్టం చేశారు. 

pawan kalyan fires on tdp bjp
Author
Tuni, First Published Nov 2, 2018, 9:12 PM IST

తుని: తెలుగుదేశం, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధికారమే పరమావధిగా నీచ రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆ ఆగ్రహాన్ని 2019 ఎన్నికల్లో చూపిస్తారని స్పష్టం చేశారు. 

రాజకీయాల్లోకి రావాలని 2003 నుంచే అనుకున్నానని అయితే కానిస్టేబుల్ కొడుకు రాజకీయాల్లోకి ఎందుకు అంటూ తన తల్లి బంధువులు ఆపేశారని తెలిపారు. అయితే తెలుగుజాతిని అన్యాయంగా విడగొట్టారని తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 2003లో రాజకీయాలు వద్దు అన్న తన తల్లి 2018లో ధైర్యంగా రాజకీయాల్లోకి వెళ్లు అంటూ తన తల్లి ఆశీర్వదించి నాలుగు లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. 

కుటుంబ సభ్యులను ఎంతో ఇష్టంగా ప్రేమించే అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయనను కాదనుకుని టీడీపీకి మద్దతు పలికానని తెలిపారు. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగానని అలాంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటారా అంటూ చంద్రబాబును నిలదీశారు. స్వార్ధాన్ని పక్కన, రక్తబంధాన్ని కాదనుకుని టీడీపీకి మద్దతు పలికి అధికారంలోకి తీసుకువస్తే స్వార్ధ రాజకీయాల కోసం కాంగ్రెస్ తో జతకడతారా అంటూ నిప్పులు చెరిగారు. 

2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని అయితే వాటిని అమలు చెయ్యడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. బీజేపీ,టీడీపీకి మద్దతు పలికినప్పుడే తాను అడిగానని హామీలు నెరవేర్చకపోతే తిరగబడతానని నిలదీస్తానని హెచ్చరించానని ప్ర్తస్తుతం అదే చేస్తున్నానని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, బీజేపీ మాటతప్పిందని రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయని ఆరోపించారు. తెలంగాణలో పాలకులు చేసిన తప్పుల వల్ల ఆంధ్రాకొడుకులు దోపిడీ దొంగలు అంటే ఎంతో ఆవేదన చెందానని తెలిపారు. పాలకులు నష్టం చేస్తే ప్రజలు తిట్లు తిన్నారని చెప్పుకొచ్చారు. 
 
తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఛీ కొడితే, తిడితే యనమల రామకృష్ణుడుకు, చంద్రబాబుకు పౌరుషం రాలేదు కానీ తెలుగుపౌరుడిగా తనకు కడుపు మండిందన్నారు. అందుకే జనసేన పార్టీ పెట్టానని తెలిపారు. సంరక్షించాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని విడగొట్టింది. కాంగ్రెస్, బీజేపీలు ఏకమై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు. అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు కలుస్తారా అంటూ మండిపడ్డారు. సిగ్గు శరం ఉందా అంటూ దుమ్మెత్తిపోశారు. 

తనకు మోదీ అన్నా అమిత్ షా అన్న భయం లేదని పవన్ స్పష్టం చేశారు. వేల కోట్లు ఉంటే ఐటీ దాడులు చేస్తారని కాంట్రాక్ట్ లు చేస్తే బెదిరిస్తారని తాను ప్రజల మనిషినని నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరన్నారు. తాను బీజేపీకి మద్దతు పలుకుతున్నానని టీడీపీ నేతలు ఆరోపించడాన్ని పవన్ తప్పుబట్టారు. పార్టీలు మారుతూ పొత్తులు మార్చుతూ ప్రజలను మోసం చెయ్యలేనన్నారు. బీజేపీలో జనసేనను విలీనం చెయ్యమన్నారు. ఓటమి వచ్చినా భరిస్తా కానీ టీడీపీలా తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనని పవన్ చెప్పారు.   
 
2014 ఎన్నికల్లో ఉద్యోగాలు ఇవ్వండని, మంచి పాలన అందించాలని, లా అండ్ ఆర్డర్ ఇవ్వాలని కోరానని అయితే  చంద్రబాబు అవేమీ నెరవేర్చలేదన్నారు.  నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నపిల్లను ఎత్తుకుపోయే గ్యాంగ్ ను చూశాం కానీ ప్రస్తుతం టీడీపీ నేతలు ఓట్లు ఎత్తుకుపోయే గ్యాంగ్ లా మారారంటూ ధ్వజమెత్తారు. రాజకీయ అనుభవమున్న చంద్రబాబు ఇంతలా దిగజారిపోతారా అంటూ ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు నాయుడుకు ఒక బాధ్యత అంటూ ఏమీ లేదని విమర్శించారు. అలాంటి వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టనన్నారు. మోసం చేసేవాళ్లు కాదు ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసేవారు కావాలని పవన్ అభిప్రాయపడ్డారు. 

గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాడిన వ్యక్తులపై కేసులు పెట్టించారు, లాఠీ చార్జ్ చేయించారు, భయపెట్టారు అలాంటి చంద్రబాబు నేడు ధర్మపోరాట దీక్షల పేరుతో డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను నిలదీస్తున్నందుకు తనపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రజలను తప్పదోవపట్టిస్తున్నట్లు చంద్రబాబు ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అడ్డగోలుగా రాజకీయాలు చెయ్యనని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా, కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయిపోయారంటూ విమర్శించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడు దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ నిప్పులు చెరిగారు.  

రాజకీయాల్లో ఎంతో అనుభవం, తెలివితేటలు కలిగిన యనమల నియోజకవర్గ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని కేవలం ఆయన వియ్యంకుడుకు మాత్రమే ఉపయోగపడ్డారన్నారు. వియ్యంకులకు కాంట్రాక్ట్ ఇప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.  

తెలుగుదేశం పార్టీలో అవకాశవాదం పెరిగిపోయిందన్న పవన్  అధికారం కోసం కాంగ్రెస్ తో జతకట్టిందన్నారు. కాంగ్రెస్ అవమానం చేస్తేనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అలాంటి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా అని నిలదీశారు. తెలుగుజాతిని దెబ్బతీసిన కాంగ్రెస్ తో కుమ్మక్కై ఢిల్లీ లో తాకట్టుపెడతారా అంటూ నిలదీశారు. గెలవాలనుకుంటే రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లక్కర్లేదని తనదగ్గరకు వస్తే గెలిపించేవాడిని కదా అంటూ చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏపార్టీతో అయినా పొత్తుపెట్టుకుంటారని ఆరోపించారు. ఒకప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటున్నారని భవిష్యత్ లో జగన్ తో కూడా కలిసిపోవచ్చునన్నారు. పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలనుకుంటే వైసీపీతో కలిసిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నైజమే అదన్నారు. చంద్రబాబు నాయుడు ఎలా రాజకీయాల్లోకి వచ్చారో తనకు తెలుసునన్నారు. సొంతమామను దెబ్బతీసి అధికారంలోకి వచ్చారన్నారు. మామను వెన్నుపోటు పొడిచారని తెలుసు అయినా టీడీపీకి మద్దతు పలికానని తెలిపారు. అయినా టీడీపీని సంపూర్ణంగా నమ్మలేదన్నారు. 

బీజేపీ అంటే జగన్ పవన్ పార్టీ అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని తాను ఆ స్థాయికి దిగజారలేదన్నారు. అవసరమైతే కుత్తికోసుకుంటా కానీ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టను అని ధీమా వ్యక్తం చేశారు. 

2019 కీలక సమయం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో జనసేనకు ఓటు వెయ్యాలని కోరారు. నాదగ్గర వేలకోట్లు ఆస్తులు లేవు. చంద్రబాబులా హెరిటేజ్ కంపెనీలు లేవు, కానీ మీ ఆదరణ మాత్రం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అంటూ ఒక మంత్రంలా పఠిస్తున్నారు మీరంటే కచ్చితంగా సీఎం అయి తీరుతానన్నారు. 

సీఎం అవ్వాలన్నది తన కోరిక కాదని లక్షల ఉద్యోగం ఇచ్చేందుకు, అసంఘటిత కార్మికులకు, వలసకార్మికులను ఆదుకునేందుకు సీఎం అవుతాన్నారు. తునిలాంటి ఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ దెబ్బతినకుండా చూస్తానని కత్తితో పొడిచినా చంద్రబాబులా చూడకుండా ఖండిస్తానన్నారు.  

రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే నా ఆశయమన్నారు. సీఎం అవ్వాలని రాజకీయాల్లోకి రాలేదన్నారు. సినిమాలపై వ్యామోహం లేదన్నారు. అవినీతి లేని రాజకీయ వ్యవస్థకోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. కోట్ల బుల్లెట్లు కంటే ఓటు అనే బుల్లెట్ చాలా విలువైనదని పవన్ అన్నారు. ఓటు హక్కు అనే ఆయుధంతో మోసం చేసే పార్టీలకు బుద్ది చెప్పాలని సూచించారు. అవినీతిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.  

కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఓటెయ్యాలని కోరారు. కులం ఓ దరిద్రమని కులాల ముసుగులో దోపిడీలు చేసి వ్యక్తులంటే తనకు నచ్చదన్నారు. 2019 నుంచి 2021లోపు దేశంలో బలమైన రాజకీయ మార్పులు జరగబోతున్నాయన్నారు. సరికొత్త రాజకీయ శకం రాబోతుందని తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి కాలం మళ్లీ వస్తుందన్నారు. ప్రజల్లో నుంచే బలమైన నాయకులు పుడతారని తానే వారిని తయారు చేస్తానన్నారు. 

 
జగన్ లా వేల కోట్లు లేవు, చంద్రబాబులా హెరిటేజ్ కంపెనీలు లేవు, తాను దిగువ మద్యతరగతి వ్యక్తిని పవన్ చెప్పారు. పవర్ స్టార్ అంటే పవర్ మీరు ఇచ్చేది స్టార్ పైన ఉండేదన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

సామాన్యుడితో పవన్ రైలు యాత్ర

చంద్రబాబు సినిమా ప్లాప్ అవ్వడం ఖాయం:పవన్ కళ్యాణ్

జగన్ పై దాడి ఘటనలో టీడీపీ వెకిలి వేషాలు:పవన్ కళ్యాణ్

Follow Us:
Download App:
  • android
  • ios