అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దుచేస్తామంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. 

గిరిజనులు వద్దన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదని జగన్ స్పష్టం చేశారు. 

బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసేందుకు జనసేన పార్టీ అలుపెరగని పోరాటం చేసిందని తమ ఒత్తిడితోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలన్నదే తమ అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమని చెప్తున్నారు. 

ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాంటూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారని జనసేన చెప్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ జీవో జారీ చేస్తానంటూ పవన్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పటికీ ఆయన లక్ష్యాన్ని సీఎం జగన్ నెరవేర్చారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వైయస్ జగన్ తమను ఫాలో అవుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. 

ఇకపోతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవకంలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే బాక్సైట్‌ ఖనిజాన్ని దోచేస్తారని ఆరోపించారు. 

వైయస్ జగన్ అధికారంలోకి వస్తే బాక్సైట్ ను దోచేస్తారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాక్సైట్ తవ్వకాలు నిలిపివేస్తామంటూ జీవో జారీ చేయడం తమను విమర్శించిన వాళ్ల నోరు మూయించడమేనని వైసీపీ అభిప్రాయపడుతోంది.