ఎన్నికల్లో ఓటమి.. పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని కోరుతున్నాయని.. ఎవరితో కలిసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత స్పష్టం చేశారు.

రాజకీయాల్లో విలువలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీని మరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. సోమవారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల నూతన కమిటీ తొలి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

బలమైన రాజకీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడాల్సి రావడం... డబ్బు, మీడియా వంటివి లేకపోవడం వల్లే జనసేన ఓడిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లే సాధించినా తనకు ఎంతో సంతోషం కలిగిందని.. రాజకీయాలవైపు తన అడుగులకు కారణం అన్నయ్య నాగబాబేనని జనసేనాని తెలిపారు.