మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం కానుంది. ఏపీలో నేటినుంచి మూడు రోజుల పర్యటనలో భాగంగా వైసీపీ, జనసేన, టీడీపీలతో సహా రాజకీయపార్టీలతో భేటీ కానుంది. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మంగళవారం నుంచి మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల సంఘం రెండో విడత పర్యటన చేయనుంది. దీనికోసం సోమవారం సాయంత్రమే సీఈసీ బృందం విజయవాడకు చేరుకుంది. ఈ బృందంలో సీఈసీ రాజీవ్ కుమార్ తో పాటు, కమీషనర్లు అనూప్, అరుణ్ గోయల్ లతో సహా తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. విజయవాడకు వచ్చిన వీరికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. ఆ తర్వాత సోమవారం రాత్రే సీఈసీ రాజీవ్ కుమార్ సీఈఓ ఎంకె మీనాతో సమావేశమయ్యారు. మంగళవారం నాడు జరిగే సమావేశం అజెండా అంశాల మీద సమీక్ష చేశారు.

జనవరి 9వ తేదీ మంగళవారం నాడు సీఈసీ బృందం రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అవుతుంది.

జనవరి 10వ తేదీ, బుధవారం నాడు రాష్ట్ర సిఎస్, డిజిపి సహా వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది.

పదవ తేదీన ఎన్నికల సన్నధతపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇస్తారు.

తుంటి విరిగిందా: రేవంత్ రెడ్డికి కొడాలి నాని కౌంటర్

ఈ మూడు రోజుల పర్యటనలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల తొలగింపు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై క్షేత్రస్థాయి పరిశీలన ఉంటాయి. వీటితోపాటు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సీఈసీ బృందం ప్రత్యేకంగా సమీక్ష జరుపుతుంది. దీంట్లోనే ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెక్ కూడా ఉంటుంది. 

వైసిపి నేతలు మంగళవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం కానున్నారు. వైసిపి నుంచి మార్గాన్ని భరత్, విజయసాయిరెడ్డితో ఎన్నికల సంఘంతో సమావేశం కానున్నారు. టిడిపి ఓటర్ల నమోదులో అవకతవకలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాదు తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు.. మళ్లీ ఏపీలో ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి వివరాలు ఆధారాలతో సహా వైసిపి ఫిర్యాదు చేయనుంది.

ఇక టిడిపి, జనసేన అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా సీఈసీ బృందంతో భేటీ కానున్నారు. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు రాష్ట్రవ్యాప్తంగా జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాల మీద ఫిర్యాదులు చేయనున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను ముఖ్యంగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు.