Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు- పవన్ ఏం చేసినా.. మళ్లీ వచ్చేది జగనే: మంత్రి అంబటి వ్యాఖ్యలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని పార్టీలు కలిసినా మళ్లీ గెలిచేది జగనేనని ఆయన అన్నారు. 

pawan kalyan and chandrababu naidu cannot defeat ys jagan says ambati rambabu
Author
Amaravati, First Published Jun 25, 2022, 4:47 PM IST

ఏపీలో మళ్లీ రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) జోస్యం చెప్పారు. శనివారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జగన్ ను (ys jagan) ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఒక్క రూపాయి అవినీతికి కూడా తావు లేకుండా ఇప్పటి వరకు లక్షా యాభై వేల కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేశామని మంత్రి చెప్పారు.

వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వనని చెబుతున్న పవన్ కల్యాణ్ (pawan kalyan) ఒకసారి బీజేపీతో (bjp) పొత్తు అంటారని, మరొకసారి ప్రజలతోనే పొత్తు అంటారని, ఇంకోసారి మూడు ఆప్షన్లు అంటారంటూ అంబటి సెటైర్లు వేశారు. తన రహస్య మిత్రుడు చంద్రబాబుతో (chandrababu naidu) కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను పవన్ ఓడించలేరని ఆయన స్పష్టం చేశారు. జులై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాంబాబు పేర్కొన్నారు. 

అంతకుముందు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. పార్టీలో కొందరు అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని.. అలాంటివారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పార్టీలో అందరిని కలుపుకుని పోవాలని సూచించారు. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తనకు తెలుసని.. కొందరు అనుచితంగా చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నానని చెప్పారు. 

వైసీపీలో గ్రూపులు, ఆధిపత్య పోరు సరికాదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన, పనిచేసిన ఉపేక్షించేది లేదన్నారు. వారి తీరు మారకుంటే సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. నేల విడిచి సాము చేయకండని పార్టీ శ్రేణులకు సూచించారు. ఒక నియోజకవర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అవ్వడం కుదురుతుందా అని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే వైసీపీ అభ్యర్థినని స్పష్టం చేశారు.ఎంతమంది ఏకమైనా ఇక్కడ తాను ఎమ్మెల్యేనని, రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అని చెప్పారు. తాను అమాయకుడిని కాదని.. అమాయకుడిని అయితే నాలుగుసార్లు గెలిచేవాడినా..? అని కామెంట్ చేశారు. తనకు అందరి మనోభావాలు తెలుసని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios