Asianet News TeluguAsianet News Telugu

ఒడిషా రైలు ప్రమాదం : విశాఖ రైల్వే స్టేషన్‌లో గందరగోళం.. రైళ్ల కోసం ప్రయాణీకుల పడిగాపులు

ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

passengers confusion at vizag railway station due to Diversion and Cancellation of Trains ksp
Author
First Published Jun 3, 2023, 6:22 PM IST

ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వే స్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ రైలు నడుస్తుందో, ఏ రైలు రద్దయ్యిందో తెలియక ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. రైళ్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తుండగా.. తమకు సమాచారం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రమాదం నేపథ్యంలో హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-హైద్రాబాద్(18045), హౌరా-తిరుపతి(20889) రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 

అలాగే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్-040-27788516, విజయవాడ 0866-2576924, సామర్లకోట-7382629990, రాజమండ్రి-0883-2420541, ఏలూరు-08812-232267, తాడేపల్లి గూడెం-08818-226212, బాపట్ల-08643-222178, తెనాలి-08644-227600, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడూరు-0862-4250795, రేణిగుంట-9121272320, 9493548008, తిరుపతి-7815915571, 9346903954 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.

అయితే ఈ ప్రమాదంపై రైల్వే అధికారుల బృందం ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'సిగ్నలింగ్ వైఫల్యం' కారణంగా ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని నిపుణుల బృందం ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టి పట్టాలు తప్పిందని నిపుణులు బృందం తెలిపింది. ‘‘12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కోసం అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇవ్వబడింది.  ఆ తర్వాత ఆపివేయబడింది. ఈ క్రమంలోనే రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి.. అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పింది’’ నిపుణుల నివేదిక పేర్కొంది. 

ALso Read: Odisha Train Accident: ఆ తప్పిదమే ప్రమాదానికి కారణమా?: నిపుణుల ప్రాథమిక నివేదిక ఏం చెబుతుందంటే..

‘‘అదే సమయంలో రైలు నంబర్ 12864 (యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్) డౌన్ మెయిన్ లైన్ గుండా వెళ్లింది. దానిలోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. బోల్తా పడ్డాయి’’ అని నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక పేర్కొంది. అయితే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ సిగ్నల్ ఇచ్చి ఎందుకు టేకాఫ్ చేశారన్నది మాత్రం నిపుణుల బృందం ప్రాథమిక నివేదికలో స్పష్టం చేయలేదు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు సమగ్ర దర్యాప్తులో మాత్రమే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

అంతకుముందు ఒడిశాలో రైలు ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందించబడతాయి. ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుంది. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు
 

Follow Us:
Download App:
  • android
  • ios