బస్సులో ఎక్కిన ప్రతి ప్రయాణికుడు టికెట్ తీసుకోవడం తప్పనిసరి. అలా టికెట్ తీసుకోమని చెప్పినందుకు ఓ మహిళా కండక్టర్ కి చేదు అనుభవం ఎదురైంది. టికెట్ తీసుకోకుంటే బస్సులో నుంచి దింపేస్తానని చెప్పిందని..  కండక్టర్ దుస్తులు చింపేశాడు. అక్కడితో ఆగకుండా ఆమెపై పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో శివారెడ్డి అనే ప్రయాణికుడు ఎక్కాడు. బస్సు గుర్రంకొండ, తరికొండల గ్రామాల వద్దకు చేరుకున్న సమయంలో.. టికెట్ తీసుకోవాలని మహిళా కండక్టర్ శివారెడ్డి ని కోరింది. అందుకు అతను స్పందించలేదు. బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవాలని ఆమె మరోసారి సూచించింది.

Also Read కర్నూలులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో పేలిన బాంబు...

అందుకు అతను పొగరుగా సమాధానం చెప్పాడు. దీంతో.. టికెట్ తీసుకోకుంటే బస్సులో నుంచి దింపేస్తానని కండక్టర్ చెప్పింది. దీంతో.. ఈ విషయంలో ఇరువురికి కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శివారెడ్డి కోపంతో ఊగిపోయాడు. వెంటనే..  మహిళ అని కూడా చూడకుండా సదరు కండక్టర్ ఒంటిపై ఉన్న షర్ట్ ని చింపేశాడు.

అనంతరం ఆమె పై పిడుగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు ఆపేందుకు ప్రయత్నించినా అతను పట్టించుకోకపోవడం గమనార్హం. అతనిని అతి కష్టం మీద ప్రయాణికులు కంట్రోల్ చేశారు. అనంతరం శివారెడ్డిని చితకబాది పోలీసులకు అప్పగించారు. కాగా... శివారెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.