అనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ రాష్ట్ర పర్యటనపై ఆమె వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధాని మోడీ మళ్లీ ఎలా అడుగుపెట్టారని ఆమె ప్రశ్నించారు. 

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చాపట్లలో మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి మోడీ చేసిన ద్రోహాన్ని తెలుగు ప్రజలు మరచిపోరని అన్నారు. అమరావతిని ఢిల్లీకి మించి నిర్మిస్తానని ప్రధాని చెప్పారని, కానీ నిధుల ఊసే లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం లేదని అన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరుకు వచ్చినప్పుడు చెప్పిన ప్రధాని ఇప్పుడు అదే గుంటూరులో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పరిటాల సునీత అన్నారు. మోడీ గుంటూరుకు తమ నాయకుడు చంద్రబాబును తిట్టడానికే వచ్చినట్లుందని ఆమె అన్నారు.
 
జగన్ మోహన్ రెడ్డి గురించి ఒక్క మాట కూడ మాట్లాడలేదంటేనే జగన్‌తో మోడీ కుమ్మక్కయ్యారని తెలుస్తోందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ కాబట్టే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడుపుతున్నారని అన్నారు. 
 
చంద్రబాబు బీజేపీ యేతర కూటమి ఏర్పాటు ప్రయత్నంతో మోడీ పీఠం కదులుతుందని భయపడుతున్నారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి కలలో కూడా చంద్రబాబు నాయుడే గుర్తొస్తున్నారన్నారని ఆమె అన్నారు. కేంద్రం కూడా అసాద్యమన్న రుణమాఫీ చేసి రాష్ట్రంలోని రైతులను చంద్రబాబు ఆదుకున్నారని ఆమె అన్నారు.
 
ముగ్గురు మోడీలు కలిసి చంద్రబాబుని తొక్కాలని చూస్తున్నారని పరిటాల సునీత విమర్శించారు. ఎంతమంది మోడీలు కలిసినా చంద్రబాబు ఏమీ చేయలేరని ఆమె అన్నారు.