Asianet News TeluguAsianet News Telugu

నీ సోదరి షర్మిల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా? జగన్ రెడ్డి!...: టిడిపి అనురాధ సవాల్

సోదరి వైఎస్ షర్మిల సంధించిన ప్రశ్నలకు సీఎం జగన్ గానీ, వైసిపి నాయకులు గానీ సమాధానం చెప్పే దమ్ముందా? అని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు. 

Panchumarthi Anuradha Reacts YS Sharmila comments on CM Jagan akp
Author
Amaravati, First Published Jul 9, 2021, 11:44 AM IST

అమరావతి: పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించవచ్చు... కౌగలించుకోవచ్చు... భోజనాలు పెట్టొచ్చు... స్వీట్లు కూడా తినిపించుకోవచ్చు... కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయతీలు మాట్లాడుకోలేరా? అని సొంత చెల్లి షర్మిలే సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిందని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ గుర్తుచేశారు. షర్మిల ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి గానీ, వైసీపీ నేతలకుగానీ ఉందా? అని అనురాధ నిలదీశారు. 

''వ్యవసాయ రంగాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం ఉద్ధరించారని ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించి ఉత్సవాలు జరుపుకున్నారు? రైతులకు ఆరోజు వైఎస్ చేసింది, ఈరోజు మీరు చేసింది ఏమీ లేదు. మీరు జరుపుకోవాల్సింది రైతు దినోత్సవాలు కాదు రైతు సంకెళ్ల దినోత్సవాలు, రైతులను కాల్చి చంపిన దినోత్సవాలు, రైతులను కన్నీరు పెట్టించిన దినోత్సవాలు'' అని మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. మెజారిటీ వైసీపీ నేతలకు కేసీఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. జగన్ చేసిన మోసానికి ఒక చెల్లి ఢిల్లీ వీధుల్లో, ఒక చెల్లి హైదరాబాద్ వీధుల్లో పోరాడుతున్నారు'' అన్నారు.

''నాడు రుణమాఫీ వడ్డీ కట్టలేదని గుంటూరు జిల్లా భట్టిప్రోలులో రైతులకు వైఎస్ సంకెళ్లు వేయించారు. ముదిగొండ, సోంపేట, కాకరాపల్లిలో 12మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరా రైతు సంక్షేమం గురించి ఆలోచించేంది? వైఎస్ హయాంలో ఎరువుల కోసం క్యూలో నిలబడిన రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకొంతమంది రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు'' అని గుర్తుచేశారు. 

read more  జలజగడంపై కేసీఆర్ మీద షర్మిల వ్యాఖ్యలు: వైఎస్ జగన్‌కు షాక్

''పోలవరం పనులు 2 శాతం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేయలేదు. డబ్బు కోసం కాల్వలు ముందే తవ్వించేశారు. నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగింది. రైతులకు గిట్టు బాటు ధరలు ఇంతిచ్చాం, అంతిచ్చామని సాక్షిలో గొప్పలు చెబుతున్నారు. అదే నిజమైతే వైఎస్ హయాంలో గిట్టుబాటు ధర అందక 14,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి చంద్రబాబు హయాంలో రూ.5 లక్షలు అందించారు'' అని తెలిపారు. 

''నాడు వైఎస్- నేడు జగన్ ఇద్దరూ స్వప్రయోజనాల కోసం కేంద్రం ముందు సాగిలపడ్డారు. వైఎస్ హయాంలో ఐదేళ్లలో పావల వడ్డీ కింద రూ. 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మేము చాలెంజ్ చేస్తున్నాం. నిరూపించగలరా మీరు? రైతు రుణమాఫీ వద్దు, మిగులు జలాల హక్కులు వద్దని చెప్పిన వైఎస్ ఆంధ్రాకు అన్యాయం చేశారు.  ఇడుపులపాయలో దళిత భూముల కాజేసిన మీరా రైతులను ఉద్దరించేంది? వైసీపీ నేతలకు అసలు మనస్పాక్షి ఉందా?'' అంటూ మండిపడ్డారు. 

''తెలుగుదేశం అంటేనే రైతు సంక్షేమ పార్టీ. ఎన్టీఆర్ సుజల స్రవంతి, గాలేరు –నగరి, తెలుగుగంగ టీడీపీ హయాంలో వచ్చినవే. రెండేళ్లలో పోలవరం పనులు ఎంతమేర పూర్తి చేశారో వైసీపీ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. నాడు బడ్జెట్ లో చంద్రబాబు ఐదేళ్లలో రూ. 81,554 కోట్లు కేటాయించారు. చంద్రబాబు రూ. 24,500 కోట్లు రుణమాఫీ చేశారు. రెండేళ్ల వైసీపీ పాలనలో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. టీడీపీ హయాంలో పెట్టుబడి లేని వ్యవసాయ ప్రాజెక్టుకు ప్యారీస్ లో జరిగిన పీస్ ఫోరమ్ లో పురస్కారం దక్కింది'' అన్నారు. 

''క్రాప్ హాలిడే , విద్యుత్ కోతలు మొదలైంది వైఎస్ హయాంలోనే . ధాన్యం కొనుగోలు డబ్బులు ఇప్పటికీ చెల్లించకపోతే రైతుల పరిస్థితి ఏంటీ? పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు, వ్యయం శ్వేతపత్రం విడుదల చేయాలి. అసెంబ్లీలో చంద్రబాబు పోరాటం వల్లే రైతులకు ధాన్యం కొనుగోలు డబ్బు విడుదల చేశారు...అది కూడా అరకొరగానే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా రైతులను పట్టించుకోకపోవడం బాధాకరం'' అని అనురాధ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios