నరసరావుపేటలో వరుస హత్యలు: సైకో కిల్లర్ అంకమ్మరావు అరెస్ట్
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీరియల్ హత్యలకుపాల్పడుతున్న సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
నరసరావుపేట: ఒంటరిగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని హత్య చేస్తున్న సైకో కిల్లర్ అంకమ్మరావును పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశార. చిల్లర డబ్బుల కోసం అంకమ్మరావు ఈ హత్యలకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఉదయం పూట పాత పేపర్లు ఏరుకొని జీవనం సాగించేవాడిగా ఉంటాడు.ఈ సమయంలో ఒంటరిగా ఉన్నవారిని గుర్తించి రాత్రి పూట వారిపై దాడి చేసి హత్యలకు పాల్పడుతుంటాడని పోలీసులు చెప్పారు.
అంకమ్మరావు 2022 జూన్ మాసంలో వృద్దురాలిని హత్య చేశాడు. వృద్దురాలి వద్ద ఉన్న రూ. 2 లక్షలను దోచుకున్నాడు. అంకమ్మరావు ఈ హత్య చేసినట్టుగా రుజువు కాకపోవడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా అంకమ్మరావు ప్రవర్తనలో మార్పు రాలేదు.
గత వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురిని నిందితుడు అంకమ్మరావు హత్య చేశాడు. ఈ నెల 5వ తేదీన ఓ వృద్దురాలిని హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ. 500లను నిందితుడు ఎత్తుకెళ్లాడు. ఈ నెల 10వ తేదీన వేర్వేరు చోట్ల ఇద్దరిని హత్య చేశాడు. ఒకరి వద్ద రూ. 40, మరొకరి వద్ద రూ. 120 దోచుకున్నాడు. ఈ హత్యలను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అంకమ్మరావు ఈ హత్యలు చేసినట్టుగా సీసీటీవీ దృశ్యాల్లో పోలీసులు గుర్తించారు.దీంతో అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలపై అంకమ్మరావును విచారిస్తున్నారు.
ఈ హత్యలు అంకమ్మరావు ఎందుకు చేశడనే విషయమై ఆరా తీస్తున్నారు. సైకో మనస్తత్వం కారణంగా హత్య చేశాడా , లేక ఇతరత్రా కారణాలతో హత్య చేశారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.