అధికార పార్టీ నేతలు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని... అధికారుల పై ఒత్తిడి చేసి తమ ఉద్యోగాలు పోయేలా చేస్తున్నారని  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల మండలం ఎగువచర్లోపల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎగువచర్లోపల్లి మోడల్‌ స్కూల్‌ వసతి గృహంలో వాచ్‌ ఉమన్‌గా గోదా విశ్రాంతమ్మ, హెడ్‌కుక్‌గా బోధనపు శ్రీలక్ష్మి, సహాయకులుగా ఇట్ల మల్లీశ్వరి, పులిగుజ్జు రాజేశ్వరి అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ, వారిని విధుల నుంచి తప్పుకోవాలంటూ వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. 

తాము ఉద్యోగాలు వదిలేసి వెళితే.. తమ పార్టీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను ఉద్యోగాల నుంచి తప్పించాలని  ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌పైనా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ద్వారా సిఫారసు చేయించి డీఈవో నుంచి లిఖితపూర్వకంగా తమ మద్దతుదారులను నియమించుకునేలా అనుమతులు తెచ్చుకున్నారని చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఆ నలుగురిని ప్రిన్సిపాల్‌ తప్పించారు. దీంతో మనోవేదనకు గురైన మల్లీశ్వరి, రాజేశ్వరి ఫినాయిల్‌ తాగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రాణాపాయం తప్పింది. తమను కలిసిన మీడియా వద్ద వారు కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘మూడేళ్లుగా ఈ ఉద్యోగాన్నే నమ్ముకున్నాం. కొద్దిపాటి జీతమైనా పని చేస్తున్నాం. ఉన్నట్టుండి వెళ్లిపొమ్మంటే ఎలా? పనులు సక్రమంగా నిర్వహించకపోతే తొలగించడం న్యాయమే. కానీ మేము బాగా పని చేస్తున్నా విధుల నుంచి తప్పించడం ఎక్కడి న్యాయం?’ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.