విజయవాడ: ఆపరేషన్ గరుడ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సినీనటుడు శివాజీ మరో బాంబు పేల్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ గరుడ పేరుతో లీకులు ఇస్తున్న శివాజీ తాజాగా మరో లీక్ ఇచ్చారు.  రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కొత్త నాయకుడు ఓ ప్లాన్ వేశారని అయితే అది విఫలమైందని తెలిపారు. 

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి సినీనటుడు శివాజీ చెప్పినట్లు ఆపరేషన్ గరుడలో భాగమేనని నమ్మాల్సి వస్తోందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు సైతం అంటున్నారు. అయితే జగన్ పై దాడి గురించి స్పందించని శివాజీ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగిందన్నారు. 

జాతీయ పార్టీతో కలిసి పొరుగురాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరికించినట్టే ఇరికిద్దామనుకుని ఓ కొత్త నాయకుడు ప్లాన్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే అదికాస్త ఫెయిల్ అయ్యిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడేయాలని చూశారన్నారు. త్వరలో ఆ కుట్ర బయటపెడతానని స్పష్టం చేశారు. 

ఇవన్నీ చెప్పిన శివాజీ ఆ కొత్తనటుడు ఎవరో అన్న విషయం మాత్రం చెప్పలేదు. పేరు ప్రస్తావించకుండా కొత్త నాయకుడు అంటూ సంబోధించారు. అయితే ఆపరేషన్ గరుడ పేరుతో తాను మెుదటి నుంచి చెప్తున్న ప్రతీమాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.