రెండో తరగతి చదివే చిన్నారి... కనీసం అత్యాచారం అంటే అర్థం కూడా తెలియని వయసు. అలాంటి చిన్నారిపై తాత వయసు ఉన్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇస్తానంటూ పిలవడంతో.. తాత లాంటోడే కదా అని అమాయకంగా వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదునుగా చేసుకున్నాడు. కామంతో కళ్లుమూసుకుపోయి... బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీరా... అడ్డంగా దొరికపోవడంతో కావాలంటే డబ్బులు ఇస్తానంటూ బాలిక తల్లిదండ్రులతో బేరం మాట్లాడాడు. ఈ దారుణ సంఘటన శ్రీకాకుళం జిల్లా మందసలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మందస మండలానికి చెందిన గొరకల రిషి(62) ఈ నెల 18వ తేదీన రెండో తరగతి చదివే విద్యార్థిని బిస్కెట్లు, చాక్లెట్స్ ఇస్తానని నమ్మించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. నిజమని నమ్మిన చిన్నారి అతని ఇంటికి వెళ్లగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన తర్వాతి రోజు బాలిక అస్వస్థతకు గురయ్యింది. 

జననేంద్రియాల వద్ద తీవ్ర నొప్పి, మంట రావడంతో తట్టుకోలేక చిన్నారి తన తల్లికి చెప్పింది. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు. జరిగిని ఘోరాన్ని చిన్నారి తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్దకు తీసుకువెళ్లారు. దీంతో నిందితుడు చేసిన తప్పును అంగీకరించాడు. అయితే.. చేసిన తప్పుకి బాధిత కుటుంబానికి డబ్బులు ఇస్తానంటూ బేరాలు ఆడటం మొదలుపెట్టాడు.

కాగా అందుకు చిన్నారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.