పచ్చని పెళ్లి పందిట్లో చిచ్చు పెట్టిన చంద్రన్న పెళ్లి కానుక

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 1, Sep 2018, 10:59 AM IST
Officers negligence in Chandranna Pelli kanuka
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న పెళ్లి కానుక...పెళ్లి చేసుకోబోతున్న ఓ జంటకు చుక్కలు చూపించింది . పెళ్లి చేసుకోబోతున్నాం..చంద్రన్న పెళ్లి కానుకకు తాము అర్హులమంటూ దరఖాస్తు చేసుకున్న ఆ జంటకు అధికారులు చెప్పిన సమాధానంతో కళ్లు భైర్లు కమ్మాయి. కానుక మాట అటుంచితే వరుడికి ఇదివరకే  పెళ్లయ్యిందని చెప్పడంతో ఆ జంట ఒక్కసారిగా ఆందోళన చెందారు. 
 

కడప: తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న పెళ్లి కానుక...పెళ్లి చేసుకోబోతున్న ఓ జంటకు చుక్కలు చూపించింది . పెళ్లి చేసుకోబోతున్నాం..చంద్రన్న పెళ్లి కానుకకు తాము అర్హులమంటూ దరఖాస్తు చేసుకున్న ఆ జంటకు అధికారులు చెప్పిన సమాధానంతో కళ్లు భైర్లు కమ్మాయి. కానుక మాట అటుంచితే వరుడికి ఇదివరకే  పెళ్లయ్యిందని చెప్పడంతో ఆ జంట ఒక్కసారిగా ఆందోళన చెందారు. 

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన ఓబులేసుకు అదే ప్రాంతానికి చెందిన రామాంజనమ్మ సెప్టెంబర్ 19న గండి క్షేత్రంలో వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. ఇరువురి కుటుంబీకులు స్థానిక ఇటుకల పరిశ్రమల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిరుపేదలైన ఇరుకుటుంబీకులు సీఎం చంద్రబాబు ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.

ఆన్‌లైన్‌లో వివరాల నమోదు సందర్భంగా ఓబులేసుకు ఇదివరకే వివాహం అయిందని సర్వే జాబితాలో ఉంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సంబంధిత అధికారులను సంప్రదించగా ప్రజాసాధికార సర్వేలో ఓబులేసుకు పెళ్లైందని ఉందని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని గ్రామదర్శినిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికాకుండానే పెళ్లి అయిందని ఎలా రాస్తారని అధికారులను ఓబులేసుతో పాటు బంధువులు నిలదీశారు. అయితే అది తమ తప్పిదం కాదని చెప్పి చేతులు దులుపుకున్నారు. 

కనీసం తప్పును సరిదిద్దితే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటామని బాధితులు కోరగా.....తమకు ఆ అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రజాసాధికార సర్వే సమయంలో ఉన్న సూపర్ వైజర్ మాత్రమే తప్పును సరిచేయగలరని స్పష్టం చేశారు. తామేమి చేయలేమని ఖరాకండిగా చెప్పేశారు. పోనీ ఆ సమమంలో సర్వే చేసిన అధికారుల వివరాలు ఇవ్వాలని కోరినా అవి తమ దగ్గర లేవని అధికారులు తెలిపారు. మరోవైపు తమకు అన్యాయం జరిగిందని డయల్ 1100కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వారు వాపోతున్నారు.

ఒకే గ్రామానికి చెందిన వారు కాబట్టి ఓబులేసుకు పెళ్లి కాలేదని తెలుసు..అదే వేర్వేరు గ్రామాలు అయితే పెళ్లి పెటాకులయ్యేదని....లేదా కేసులతో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు సర్వే చేసినప్పుడు వాస్తవాలు తెలుసుకుని చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం చంద్రన్న పెళ్లి కానుక పథకానికి దూరం చేసిందని....వారి కుటుంబంలో కలతలు వచ్చేలా చేసిందని చెప్తున్నారు. 

loader