కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. చూస్తుండగానే రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఈ సంఘటన అందరికీ ఆనందం కలిగించింది. అనంతరం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఓ 85ఏళ్ల బామ్మ కరోనాతో పోరాడి విజయం సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడికి ఇటీవల కరోనా సోకింది. అతని నుంచి తల్లికి, కొడుకుకి కూడా వైరస్ సోకింది. తొలుత వైరస్ సోకిన వ్యక్తి చనిపోగా.. అతని తల్లి 85ఏళ్ల వృద్ధురాలు కోలుకోవడం గమనార్హం.

ఈ వైరస్ సోకిందని తెలియగానే తొలుత ఆమె చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. తర్వాత వైద్యులు ఆమెకు నచ్చచెప్పడంతో వైద్యానికి సహకరించారు. 16 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు.

కాగా.. ఈ వైరస్ తన కొడుకు నుంచి.. తనకు, తన మనవడికి సోకిందని ఆమె చెప్పారు. వైరస్ కారణంగా తన కొడుకు ప్రాణాలు కోల్పోగా.. తాను, తన మనవడు మాత్రం కోలుకున్నామని ఆమె చెప్పారు. మంగళవారం ఆ బామ్మని వైద్య సిబ్బంది డిశ్చార్జ్ చేశారు.

ఆ బామ్మ, మనవడితోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు కూడా కరోనా నుంచి కోలుకొని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా హిందూపురానికి చెందినవారే కావడం గమనార్హం. వీరుకోలుకోగా.. తాజాగా  జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు.