ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌జీవో) ఇకపై ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌జీజీవో)గా మారనుంది. ఎన్‌జీవో సంఘంలోని చాలా వరకు పోస్టులు నాన్ గెజిటెడ్ నుంచి గెజిటెడ్‌గా మారిపోయాయని నేతలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల్లో అత్యంత కీలకమైన ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌జీవో) ఇకపై ఆంధ్రప్రదేశ్ నాన్‌గెజిటెడ్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌జీజీవో)గా మారనుంది. ఈ మేరకు ఏపీఎన్‌జీవోలో బైలాస్ మార్పు చేసినట్లు అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న ఏపీఎన్‌జీవో రాష్ట్ర 21వ మహాసభల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘంలో మెంబర్‌షిప్ అధికంగా పెరగడంతో పోస్టులను పెంచుతున్నట్లు బండి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో 5, జిల్లాల్లో 2, తాలూకాల్లో 2 పోస్టులను పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఏపీఎన్‌జీజీవో 26 బ్రాంచీలుగా మారనుందని, అయితే బైలాస్ మార్పుపై ప్రభుత్వంప ఆమోదించాల్సి వుందని బండి శ్రీనివాసరావు చెప్పారు.
మరో నేత విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్‌జీవో సంఘంలోని చాలా వరకు పోస్టులు నాన్ గెజిటెడ్ నుంచి గెజిటెడ్‌గా మారిపోయాయని చెప్పారు. అందుచేత గెజిటెడ్‌ను కూడా తమ సంఘంలో చేర్చి పేరు మార్చినట్లు విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 250 పోస్టులు మహిళలకు కేటాయించామని వెల్లడించారు.
