అమరావతి: అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇచ్చిన హామీలను అమలుపరచడంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. నవరత్నాలద్వారా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్న జగన్, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్పుకోవాలి. 

నిరుద్యోగాన్ని సాధ్యమైనంతమేర తగ్గిస్తానని ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే 2లక్షల గ్రామ వాలంటీర్ పోస్టులను నూతనంగా సృష్టించాడు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత భారీ స్థాయి రిక్రూట్మెంట్ ను విజయవంతంగా నిర్వహించాడు. కేవలం గ్రామ వాలంటీర్లే కాకుండా, గ్రామ సచివాలయం పోస్టుల ద్వారా మరో లక్షా 40వేల మందికి ఉద్యోగాలను కల్పించే పనికి శ్రీకారం చుట్టి దానిని కూడా విజయవంతంగా పూర్తిచేసాడు. 

నోటిఫికేషన్లు ఇవ్వడం మాత్రమే కాకుండా, రికార్డు సమయంలోపల ఈ రేకరుయిట్మెంట్లను పూర్తి చేసింది జగన్ సర్కార్. ఈ రెండు నియామకాల వల్ల దాదాపుగా 3లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించినట్టయ్యింది. 

ఇక ఇప్పుడు మరో మారు గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది జగన్ సర్కార్. గత నోటిఫికేషన్లో భర్తీ అవకుండా మరో 9648 పోస్టులు మిగిలిపోయాయి. ఈ మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది.