హిందూపురం: టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ  రికార్డు మెజారిటీతో హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి విజయం సాధించారు.  1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో హిందూపురం నుండి 62వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి లక్ష్మీనారాయణరెడ్డిపై విజయం సాధించారు. ఈ రికార్డును ఇంతవరకు ఎవరూ కూడ ఇంకా బ్రేక్ చేయలేదు.

1995లో టీడీపీలో సంక్షోభం చోటు చేసుకొంది. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుండి దించేసి  చంద్రబాబునాయుడు సీఎం పదవిని అధిష్టించారు. అయితే ఆ సమయంలో చంద్రబాబునాయుడు వైపున హరికృష్ణ నిలిచారు. 1996 జనవరి 18వ తేదీన  ఎన్టీఆర్ మరణించారు.

ఎన్టీఆర్ 1994లో హిందూపురం నుండి ప్రాతినిథ్యం వహించారు.  అయితే 1996లో ఎన్టీఆర్ మరణంతో  హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. దీంతో హిందూపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  62 వేల మెజారిటీతో విజయం సాధించారు. హిందూపురం సెగ్మెంట్  టీడీపీకి కంచుకోట. ఈ స్థానం నుండి ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ మొదటి విగ్రహాన్ని హిందూపురంలోనే ఆవిష్కరించారు. హరికృష్ణే ఈ విగ్రహాన్ని తొలుత ఆవిష్కరించారు. కిరికెర సమీపంలో తొలిసారి పెన్నానది బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించారు. గ్రామీణ ప్రాంతాలకు స్వయంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను హిందూపురంలో ఆయన ప్రారంభించారు.