గుంటూరు: కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్రప్రభుత్వం విఫలం అయిందని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండివుంటే కరోనా కంట్రోలు చేసేవారని ప్రజలు అనుకుంటున్నారని...దానిని వైసీపీ నేతలు తట్టుకోలేక ఆయనపై తప్పుడు  విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా  చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రజలకు కరోనా నియంత్రణకై తగిన జాగ్రత్తలు, సూచనలు చెబుతూనే వున్నారన్నారు. లాక్ డౌన్ ను వైసీపీ నేతలు, మంత్రులు దారుణంగా ఉల్లంఘిస్తున్నారని... కానీ తెలుగుదేశం నేతలంతా తమ నేత చంద్రబాబు విజ్ఞప్తి తో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారని అన్నారు. 

చంద్రబాబును విమర్శించే స్థాయి నైతికత  విజయసాయిరెడ్డికి లేదన్నారు. 11 కేసులలో ముద్దాయిగా వున్న విజయసాయిరెడ్డి బెయిల్ పై ప్రస్తుతం బయట వున్నాడని...బెయిల్ రద్దు అయితే ఆయన జైలుకు పోతారన్నారు. లాక్డౌన్ లో వున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబును లాకప్ లో వున్నారని విమర్శించే నైతికత విజయసాయిరెడ్డికి లేదని  మండిపడ్డారు. 

లాక్ డౌన్ నిబంధనలకు లోబడి ఇంట్లోనే వుంటే చంద్రబాబును లాకప్ లో వున్నారని ఎలా విమర్శిస్తారా అని అన్నారు. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన నియంత్రణకు చర్యలు తీసుకోమని చెబుతున్న వారిపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కరోనా భయంకరంగా కబళిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామనే ఆలోచన చేస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్ ను ఏమనాలి అంటూ చినరాజప్ప మండిపడ్డారు.