గుంటూరు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ నిబంధనలను పాటించకుండా అధికార వైసిపి నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ హోంమంత్రి, టిడిపి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ప్రజా పంపిణీ కై రోడ్లపైకి వస్తున్న ఎమ్మెల్యేలు, నాయకులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉందని సూచించారు. 

కరోనాతో రాష్ట్ర ప్రజలకు పొంచివున్న విపత్తును గాలికి వదిలి వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ సమయంలోనూ గుంటూరు, కర్నూలు,  శ్రీకాళహస్తి, నగరిలలో స్వయంగా ఎమ్మెల్యేలే ఊరేగింపులు, రోడ్లపై ప్రదర్శనలు చేస్తూ వాతావరణాన్నికాలుష్యం చేస్తున్నారని అన్నారు. ఇకపై అయినా ఎమ్మెల్యేలు అలా చేయకుండా అదుపుచేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే వుందన్నారు.    

రాష్ట్రంలో 886పాజిటివ్ కేసులతో కరోన విజృంభించడమే కాకుండా మరో 16 వేల కేసులు పెండింగ్ లో ఉండగా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ, పారిశుద్ధ్య ఉద్యోగులకు పిపిఎ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో పాజిటివ్ వచ్చిన డాక్టర్లు, పోలీసులకు భద్రత ప్రభుత్వమే కల్పించాలని నిమ్మకాయల డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో మరణాల సంఖ్య 27కు చేరుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తితో కర్నూలు అట్టుడుకుతోంది. కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 234 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానం గుంటూరు జిల్లా ఆక్రమించింది. గుంటూరు జిల్లాలో కొత్తగా గత 24 గంటల్లో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 195కు చేరుకుంది.

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 2 కేసులు రికార్డయ్యాయి.అనంతపురం జిల్లాలో ఆరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్క కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 6 కేసులు, కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు నమోదు కాలేదు. 

ఇప్పటి వరకు 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 725 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ కారణంగా ఏడుగురేసి మరణించారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ముగ్గురు మరణించారు.