అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోములు హత్య కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేసింది. శుక్రవారం సాయంత్రం ఎన్ఐఏ కోర్టులో ఎమ్మెల్యే హత్యకు సంబంధించి అభియోగాలతో కూడిన చార్జిషీట్ ను అందజేసింది. 

సానుభూతిపరుల సమాచారంతోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, టీడీపీ నేత సివేరి సోములను మావోయిస్టులు హత్య చేసినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. ముగ్గురుపై అభియోగాలు చేస్తూ చార్జిషీట్ దాఖలు చేశారు. 

విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు సంబంధించి కదలికలను ఎద్దుల సుబ్బారావు ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేసేవాడని చార్జిషీట్ లో పేర్కొన్నారు. 

ఇకపోతే గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను  మావోయిస్టులు  కాల్చి చంపారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిని ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అత్యంత దారుణంగా కాల్చి చంపారు. 

అయితే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎహ్మెల్యే సివేరి సోమల హత్యకు సంబంధించి కొందరు నేతలు మావోయిస్టులకు సమాచారం ఇచ్చారని పోలీసులు అనుమానించారు. అందులో భాగంగా పలువురు టీడీపీ నేతల కాల్ డేటాను విశ్లేషించారు. అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ సుబ్బారావుతో సహా  మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చివరకు ఎద్దుల సుబ్బారావు, భీమిలి శోభన్, కమలలపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది.