ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై కేంద్ర బృందం ఆరా తీస్తోంది. రెండురోజులుగా వైద్య నిపుణులు పలు రకాల పరీక్షలు నిర్వహించినా కూడ ఈ వ్యాధి లక్షణాలను గుర్తించలేదు.  

ఈ వ్యాధి లక్షణాలపై వైద్య నిపుణులు  ఇంకా నిర్ధారణకు రాలేదు. అసలు ఎందుకు ఈ వ్యాధికి ప్రజలు గురౌతున్నారనే విషయమై  స్పష్టత రాలేదు. దీంతో కేంద్రం నుండి బృందం ఏలూరుకు రానుంది. ఎన్‌హెచ్‌డీసీ నుండి ముగ్గురు ప్రతినిధుల బృందం ఏలూరుకు రానుంది.

ఏలూరులో ఈ వింత వ్యాధితో 341 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఆరా తీసేందుకు గాను ఈ బృందం ప్రయత్నించనుంది.ఇప్పటివరకు వ్యాధి మూలాలను వైద్యులు తేల్చలేకపోయారు. ఈ వ్యాధితో ఇప్పటివరకు ఒకరు మరణించారు. ఈ వ్యాధితో అస్వస్థతకు గురైన వారిలో 168 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

also read:ఏలూరులో అంతుచిక్కని వ్యాధి : అంతా మామూలుగానే ఉంది కానీ.. కలెక్టర్‌ నివేదిక..

ఈ వ్యాధి విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. 341 మంది ఈ వ్యాధికి గురైనట్టుగా ఆయన ఆ నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం 157 మంది బాధితులు ఈ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన ఆ నివేదికలో తెలిపారు.

బాధితులను సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య  సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.