నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి, విక్రం రెడ్డిలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. 

వై నాట్ 175 అన్నదే మన టార్గెట్ అని ఏపీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ శ్రేణులకి ప్రతినిత్యం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్ధితులు వేరుగా వున్నాయి. అధిష్టానంపై ఎమ్మెల్యేలు, నేతలు గుర్రుగా వుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చాలా మంతి అసంతృప్త నేతలు బయటపడ్డారు. ఈ క్రమంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి బహిష్కరించారు. అయితే ఆ నలుగురిలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందినవారు కావడంతో వైసీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. పార్టీకి కంచుకోటలా వున్న ఈ జిల్లాలో చాలామంది నేతల్లో అసంతృప్తి వుంది. 

చాలా మంది చూపు టీడీపీ వైపే వుంది. ఇలాంటి పరిస్ధితుల్లో టీడీపీకి చెందిన సీనియర్ నేత వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆత్మకూరుకు చెందిన తెలుగుదేశం నేత, మాజీ జడ్పీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరనున్నారు. బొమ్మిరెడ్డితో ఇప్పటికే సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డిలు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా వైసీపీలోకి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. గతంలో వైసీపీలోనే వున్న బొమ్మిరెడ్డి.. వెంకటగిరి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం ఆయనకు కాకుండా ఆనం రాం నారాయణ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో బొమ్మిరెడ్డి టీడీపీలో చేరారు. ఇక్కడ కూడా టికెట్‌పై క్లారిటీ లేకపోవడంతో ఆయన మరోసారి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి ఎన్నికల వేళ తెలుగుదేశం నేతలు ఆయనను బుజ్జగిస్తారేమో వేచి చూడాలి.