వైసీపీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో బుధవారం కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ శంబంగి అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి వంతు వచ్చింది. ఈ సమయంలో దైవసాక్షిగా అనడానికి బదులుగా జగన్ సాక్షిగా అంటూ ప్రమాణం చేయించడంతో ప్రొటెం స్పీకర్‌ ఆయన చేత రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.

తొలి రోజు మొత్తం 173 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నరసరావుపుట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభను ప్రొటెం స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.