హైదరాబాద్: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నివాసాల్లో గురువారం నాడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో వాస్తవం లేదని ఎంపీ తేల్చేశారు. 

హైద్రాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ  అధికారులు సోదాలు చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి.  బ్యాంకులకు రూ. 826 కోట్ల మోసంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మోసం చేశాడని సీబీఐ ఎఫ్ఐఆర్ ను  నమోదు చేసింది. ఈ కేసులోనే సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారని ఆ కథనాలను ప్రసారం చేశారు.

అయితే ఈ కథనాలను ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. తన ఇంటిపై కానీ, కార్యాలయాలపై కానీ ఎలాంటి సోదాలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తన సంస్థలపై సీబీఐ సోదాలు జరిగినట్టుగా మీడియాలో వార్తలను చూసి తాను ఆశ్చర్యపోయాయని ఆయన చెప్పారు. ఢిల్లీ, హైద్రాబాద్, తన నియోజకవర్గంలో సోదాలు జరిగినట్టుగా ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

 రఘురామకృష్ణంరాజు ఇటీవల కాలంలో చేస్తున్న విమర్శలు వైసీపీ ఇబ్బందిగా మారాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.