అమరావతి: మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తేటతెల్లమైందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. కొడాలి నాని పితృభాషా ఎక్కువగా వాడుతున్నారని ఆయన చెప్పారు.

మంగళవారం నాడు ఎంపీ రఘురామకృష్ణంరాజు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో దళితులకు చోటు లేనప్పుడు శాసన రాజధానిని అమరావతిలో కాకుండా విశాఖకు తరలిస్తామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

మూడు రాజధానులపై కోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోకుంటే రాజధానిని తరలిస్తామని మంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది వైఎస్ఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యుత్ వినియోగం ఎంత జరుగుతోందో లెక్క ఉండాలని కేంద్రం చెప్పిందన్నారు. రైతులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు.

రాయలసీమలో వ్యవసాయదారులు ఎక్కువగా ఇబ్బందిపడే అవకాశం ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వ కారణమన్నారు. అక్షరాస్యతలో చివరి స్థానంలో నిలవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారికి వైసీపీలో స్థానం లేదన్నారు. రాజ్యాంగబద్దంగా తాను ఎప్పుడూ మాట్లాడుతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి హిందూ మత విశ్వాసాలపై అపారగౌరవం ఉందన్నారు.