Asianet News TeluguAsianet News Telugu

ప్రసంగాలు కాదు... మీ చిత్తశుద్దిని నిరూపించుకోండి: సీఎం జగన్ కు లోకేష్ లేఖ

కరోనా కారణంగా స్కూల్ మూతపడి తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్స్ ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి నాయకులు నారా లోకేష్ లేఖ రాశారు. 

nara lokesh written a letter to cm jagan over private teachers problems
Author
Amaravati, First Published Aug 19, 2021, 3:31 PM IST

మంగళగిరి: ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. కరోనా కారణంగా స్కూల్స్ మూతపడటంతో ప్రైవేట్ టీచర్స్ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎంకు వివరిస్తూ లోకేష్ ఓ లేఖ రాశారు. 

''రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. పాఠశాలలు పున:ప్రారంభం రోజే కర్నూలు జిల్లా కోయిలకుంట్లలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఎంతో ఒత్తిడికి గురై దంపతులు బలవన్మరణం చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ముందుగానే అర్ధవంతమైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

''ఏపీలో దాదాపు 12,000 కంటే ఎక్కువ ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మార్చి 2020లో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు సక్రమంగా జీతాలు లేవు. గత ఐదు నెలల్లో పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలలో పనిచేసే దాదాపు 5 లక్షల మంది బోధన మరియు బోధనేతర సిబ్బంది ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు భరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి'' అని పేర్కొన్నారు. 

read more  జాగ్రత్త... జగన్ రెడ్డి కుటుంబ చరిత్ర అలాంటిది: ఐఎఎస్, ఐపిఎస్ లకు అచ్చెన్న హెచ్చరిక

''ఆకలి, అప్పుల సమస్య విద్యా రంగాన్ని ఎంతో బాధిస్తుండటం కలచివేస్తోంది. బోధనా వృత్తిలో జీతాలు రాక ఉపాధ్యాయులు కూరగాయలు విక్రయించడం, భవన నిర్మాణ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా మారటం వంటి విషాద గాధలు ఎన్నో మీడియాలో చూస్తున్నాం. కోవిడ్ తదనంతర పరిణామాలు వల్ల అనేక మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు'' అన్నారు. 

''భారతీయ సంస్కృతి,  సమాజ విలువలను తీర్చిదిద్దే గురువుల గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన మీరు ప్రైవేట్ విద్యా రంగంలో పనిచేసే సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి'' అని సూచించారు.

''ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు తోచిన సాయం అందించాయి. తెలంగాణ ప్రభుత్వం నెలకి 2 వేల రూపాయిల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించింది. కర్ణాటక ప్రభుత్వం నెలకి 5 వేల రూపాయిల ఆర్థిక సహాయాన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులకు అందించారు.  ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులకు జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios