అమరావతి: రైతుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువస్తూ ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్. ముఖ్యగా పొగాకు పంటకు సరయిన ధరలేక రైతులు నష్టపోతున్నారని... వారిని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రిని లోకేష్ కోరారు. 

''పొగాకు రైతులను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులు, గత ఏడాది కిలో 170రూపాయల చొప్పున అమ్ముకున్నారు. ఇప్పుడు అది 130 నుంచి 150రూపాయలకే విక్రయించాల్సి వస్తోంది. పొగాక  వేలం సరిగా జరగడంలేదని, ఈ-వేలంలో అతి తక్కువ ధర పలకటం వంటి పరిణామాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి'' అని వివరించారు. 

read more   జగన్ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి... వలస కూలీలకు అండగా కీలక ఆదేశాలు

''వ్యాపార సీజన్ లో తమ ఉత్పత్తిని అమ్ముకోలేక 40రోజుల పాటు నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు నాణ్యత తగ్గిందనే సాకు చూపుతుండటంతో వ్యాపారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పొగాకు బార్న్ పై  దాదాపు 3లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ట్రేడర్లంతా సిండికేట్ గా ఏర్పడి ధరలు తగ్గించేశారనే ఫిర్యాదు రైతులనుంచి వ్యక్తమవుతోంది'' అని తెలిపారు. 

''రైతుల అవసరాన్ని అవకాశంగా చేసుకుంటున్న వారిపట్ల ప్రభుత్వ చర్యలు ఉండాలి. పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని దిల్లీకి పంపాలి. కేంద్రంతో పొగాకు రైతుల సమస్యను చర్చించి వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి'' అని లోకేష్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.