ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి మాజీ మంత్రులపై నారా లోకేష్ ధ్వజమెత్తారు. పనికిమాలిన వాళ్లంతా మంత్రులయి జిల్లాకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. 

విజయవాడ : సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని రాజకీయాలతో సంబంధంలేని తన తల్లిని అవమానించి చాలా పెద్ద తప్పుచేసాడని నారా లోకేష్ అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే వాడిని డ్రాయర్ పై నిలబెడతానని... రోడ్డుపై కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటూ తీసుకెళతానని లోకేష్ హెచ్చరించారు. తల్లిదండ్రులు, తనపైన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నానికి తగిన శాస్తి చేయించే బాధ్యత తనదేనని నారా లోకేష్ హెచ్చరించారు. 

యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో టిడిపి భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ క్రమలో లోకేష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు లోకేష్. సన్నబియ్యం సన్నాసికి క్యాసినోలు, గుట్కా పై తప్ప ఏ అంశంపై అవగాహన వుండదన్నారు. బూతుల నానికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని లోకేష్ అన్నారు.

ఇక రాముడి తల నరికేసినా చూసి నవ్వుకునేవాడు గతంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసాడంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ పై లోకేష్ విమర్శలు చేసారు. మాడిపోయిన పల్లీ కి దేవాలయాలను అభివృద్ధి చెయ్యడం తెలియదు... ఆయన ఆలయాల్లో కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోవడంలో ఎక్స్ పర్ట్ అంటూ ఎద్దేవా చేసారు. ఇలా కనీస అవగాహన లేని వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి పనిచేయడం ఏపీ దౌర్భాగ్యమని లోకేష్ అన్నారు. 

ఇక మరో మాజీ మంత్రి పేర్ని నాని పనికిమాలినోడు... అందుకే ఆయన పదవి పోయిందన్నారు. ప్రభుత్వ అధికారిని అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు... జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా అంటూ పిచ్చోడిలా తిరుగుతున్నాడని అన్నారు. ఇలా చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కృష్ణా జిల్లాలో ఎందుకూ పనికిరాని ముగ్గురు మంత్రులుగా చేసారు... ఇప్పుడు నాలుగోవాడు జోకర్ జోగి వచ్చాడంటూ లోకేష్ మండిపడ్డారు. 

ఒక్క ఇల్లు కట్టడం చేతకాని జోకర్ జోగి ప్రతిపక్ష నేత ఇంటిపైకి రాళ్లు వెయ్యడానికి మాత్రం వస్తాడంటూ లోకేష్ అన్నారు. ఇలాంటి వాళ్లంతా మంత్రులు అయితే ఇక కృష్ణా జిల్లా అభివృద్ది గురించి ప్రజలు మరిచిపోవాలన్నారు.

Read More ‘‘ ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా’’ .. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాటలా, యార్లగడ్డ పరిస్ధితి : కొడాలి నాని

టిడిపికి కంచుకోట లాంటి గన్నవరంలో మా తప్పుడు నిర్ణయం వల్ల ఓ పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యాడంటూ వల్లభనేని వంశీపై మండిపడ్డారు లోకేష్. తాను మంత్రిగా వుండగా సార్ సార్ అంటూ ఛాంబర్ కి వచ్చి నిలబడేవాడు... గౌరవంగా కూర్చోమన్నా అలాగే నిలబడి వుండేవాడని అన్నారు. ఇలా పిల్ల సైకోగాడు మహానటన ప్రదర్శించేవాడని అన్నారు. ఇప్పుడేమో టిడిపి నుండి గెలిచి పార్టీ మారిన పిల్ల సైకో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అన్నారు. 

2012 సన్న బియ్యం సన్నాసి పోవడంతో టిడిపికి పట్టిన సగం దరిద్రం పోయింది... ఇంకో సగం 2019లో పిల్ల సైకో పోవడంతో పూర్తిగా పోయిందన్నారు లోకేష్. పిల్ల సైకో దేవాలయం లాంటి టిడిపి కార్యాలయంపై దాడి చేసి తగలబెట్టించి పెద్ద తప్పు చేసాడన్నారు. పిల్ల సైకో కి కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తా... భయంతో బ్రతికే రోజులు దగ్గర్లో ఉన్నాయని లోకేష్ హెచ్చరించారు.

టిడిపి కార్యకర్తల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను... వడ్డీతో సహా చెల్లిస్తానని లోకేష్ హెచ్చరించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని వేధించిన వారు కృష్ణా జిల్లాలో ఉన్నా, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తామన్నారు. చట్టాలు అతిక్రమించిన అధికారులపైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు.