అమరావతి: ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నుంచి తాను ఓడిపోవడానికి గల కారణాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరిలో ప్రజలకు దగ్గరయ్యేందుకు సరిపడే సమయం లేకపోవడం వల్లనే తాను ఓడిపోయానని ఆయన అన్నారు. బుధవారం టిడిపి కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 

రోడ్లు, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఎనలేని అభివృద్ధి చేసిన చోట కూడా ఓటమి పాలయ్యామని లోకేష్ అన్నారు. అయితే ఓడిపోయినా కూడా ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయంలో పార్టీలోని ప్రతి కార్యకర్తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

కేవలం నెల రోజుల్లో 6మంది తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని కార్యకర్తలను కాపాడుకోవాలంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని లోకేష్ పిలుపునిచ్చారు. గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రశ్నించేందుకు కనీసం ఆరు నెలలు సమయం ఇచ్చే సంప్రదాయం ఉందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పొరపాట్లు, ప్రజల ఇబ్బందులు చూస్తే అంత సమయం సరికాదని అనిపిస్తోందని అన్నారు. 

ఐటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయని  ఆయన అన్నారు. జగన్ నవరత్నాలు మాత్రమే అమలు అంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల అమలు గురించి చెప్పడం లేదని అన్నారు.