Asianet News Telugu

జాదూ రెడ్డి...రెండేళ్ల తర్వాత 36 పోస్టులా? సిగ్గుండాలి...: లోకేష్ సీరియస్

 మైసూర్ బోండా లో మైసూర్ ఉండదు... జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉండవు అంటూ సీఎం జగన్ పై నారా లోకేష్ సెటైర్లు విసిరారు. 

nara lokesh serious on cm ys jagan over jobs calender akp
Author
Amaravati, First Published Jul 1, 2021, 12:58 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: జగన్ రెడ్డి ఇటీవల విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు జాదూ క్యాలెండర్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. గ్రూప్‌1,2 లో కేవలం 36 పోస్టులా? సిగ్గు సిగ్గు... అందుకే జగన్ రెడ్డి కాదు జాదూ రెడ్డి అనేది అంటూ మండిపడ్డారు. మైసూర్ బోండా లో మైసూర్ ఉండదు... జాదూ రెడ్డి జాబ్ క్యాలెండర్లో జాబ్స్ ఉండవు అంటూ లోకేష్ సెటైర్లు విసిరారు. 

జాబ్ లెస్ క్యాలెండర్ తో నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం-భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై నిరుద్యోగ యువతతో చర్చా కార్యక్రమం నిర్వహించారు లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...     పాదయాత్రలో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి అధికారం వచ్చిన రెండేళ్లకి 10 వేల ఉద్యోగాలు ముష్టి వేసి నిరుద్యోగులను పండగ చేసుకోమంటున్నారని విమర్శించారు. 

''అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి అంతరాత్మతో మాట్లాడితే ఇచ్చిన హామీలు గుర్తొస్తాయి. పాదయత్రలో ప్రచారానికి పనికొచ్చిన నిరుద్యోగులు ఇప్పుడు పనికిరారా? క్యాలెండర్ విడుదల చేసే ముందు కనీసం నిరుద్యోగ యువతతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే సమయం కూడా జాదూ రెడ్డి గారికి లేదు'' అన్నారు. 

''రెండేళ్ల పాలన లో జే ట్యాక్స్ ఫుల్లు,ఉద్యోగాలు నిల్లు. జాదూ రెడ్డి మొహం చూసి రాష్ట్రానికి కొత్తగా ఒక్క కంపెనీ రాలేదు. బెదిరింపులు, జే ట్యాక్స్ దెబ్బకి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకి క్యూ కడుతున్నాయి. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్, లులూ, అదానీ ఇలా అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కి బైబై చెప్పేసాయి. ఎన్నికల ముందు వైకాపా నాయకులు బైబై బాబు అన్నారు. ఇప్పుడు కంపెనీలు అన్నీ బైబై జగన్ అంటున్నాయి'' అని ఎద్దేవా చేశారు. 

read more  ఉద్యోగాలిమ్మని అడిగితే అత్యాచారం కేసులా?: జగన్ సర్కార్ పై అచ్చెన్న ఆగ్రహం

''జాదూ క్యాలెండర్ విడుదల చేస్తూ రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ బోగస్ ప్రకటన చేసారు జాదూ రెడ్డి. రెండేళ్ల పాలనపై విడుదల చేసిన పుస్తకంలో 4.77 లక్షల ఉద్యోగాలు కల్పించామని బోగస్ లెక్కలు రాసారు. అది అయిన 15 రోజులకే జాదూ క్యాలెండర్ విడుదల చేస్తూ మరో 1.25 లక్షల ఉద్యోగాలు కలిపి దొంగ లెక్కలు రాసి 6లక్షల ఉద్యోగాలు అని ప్రకటించారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ పోస్టులు,పేపర్ లీక్ చేసి అమ్ముకున్న సచివాలయ పోస్టులు, దశాబ్దాలుగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగాలు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇలా చెప్పుకుంటేపోతే మొత్తం దొంగ లెక్కలే'' అని లోకేష్ ఆరోపించారు. 

''వాలంటీర్లు - 2.6 లక్షల మంది.‘వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చెయ్యడం. ఇది ఉద్యోగం కాదన్నది జాదూ రెడ్డి గారే. మరి ఇప్పుడు ఉద్యోగాల లిస్టులో కలపడానికి సిగ్గు వెయ్యలేదా? 90 శాతం వాలంటీర్ పోస్టులు కార్యకర్తలకే ఇచ్చాం అని ఏ2 రెడ్డి గొప్పగా ప్రకటించారు. గ్రామ,వార్డు సచివాలయం ఉద్యోగాలను పేపర్ లీక్ చేసి వైసిపి కార్యకర్తలకు అమ్ముకున్నారు.ఆర్టీసి ఉద్యోగులు - 58 వేల మంది వీరంతా దశాబ్దాలుగా ఉద్యోగం చేస్తున్నారు. కోవిడ్ నియామకాలు - 26 వేలు. ఇవి తాత్కాలిక ఉద్యోగాలే. ఆప్కోస్ - 95 వేల మంది ఇందులో అత్యధికం మద్యం షాపుల్లో పని చేసే వారు. ఇవన్నీ తీసేస్తే నిజమైన అర్హులకు వచ్చిన ఉద్యోగాలు 15 వేల లోపే. అవి కూడా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి'' అని తెలిపారు. 

''ఉద్యోగాలు ఇచ్చింది లేకపోగా టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం 2వేల నిరుద్యోగ భృతి పథకాన్ని రద్దు చేసారు. 2.30 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తారని ఆశ పెట్టుకున్న నిరుద్యోగులు ఇళ్ళకు దూరంగా ఉంటూ, చాలీ చాలని డబ్బులతో, అర్దాకలితో, రూమ్స్ లో, హాస్టల్స్ లో ఉంటూ పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నారు. ఇలాంటి నిరుద్యోగ యువతని జాదూ రెడ్డి నట్టేట ముంచేశారు. వారు ఇప్పుడు ఇళ్ళకు వెళ్లి మొహం చూపించలేరు. ఇక్కడేమో ఉద్యోగాలు లేవు. జాదూ రెడ్డి మోసం చేసింది యువతనే కాదు, ఆ పిల్లలను నమ్ముకున్న కుటుంబాలను కూడా. ఎంత మనోవేదనతో ఉన్నారో జాదూ రెడ్డికి తెలుస్తుందా?'' అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

''రెండేళ్ల జాదూ రెడ్డి పాలనలో నిరుద్యోగం పెరిగిపోయింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగాలు రాక 300 మంది నిరుద్యోగ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్పడ్డారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం చదువుకున్న వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిరుద్యోగ రేటు 38%  ఉంది. దక్షిణాది రాష్ట్రాల‌తో పోల్చుకుంటే మన రాష్ట్ర నిరుద్యోగ రేటు ఎక్కువ. దేశంలోనే  నిరుద్యోగ రేటు ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో ఏపీ  4వ స్థానంలో ఉంది. సిఎంఐఈ సర్వే ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాష్ట్రంలో  7 లక్షలకు పైగా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఉన్నారని తేలిందంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో అర్ధమవుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
''నిరుద్యోగ యువతని అరెస్ట్ చెయ్యడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగులపై పెడుతున్న కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి. తక్షణమే జాదూ క్యాలెండర్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. పాదయాత్రలో మీరు వాగ్దానం చేసినట్లుగా 2,30,000 ఉద్యోగాలతో కొత్త ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది 6500 ఎస్ఐ, కానిస్టేబుల్  పోస్టులను భర్తీ చేయాలి.  గ్రూప్ 1 & గ్రూప్ 2 విభాగాల్లో 2 వేల పోస్టుల‌తో  జాబ్ క్యాలెండర్ కొత్త‌గా విడుద‌ల చేయాలి. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భ‌ర్తీకి మెగా డిఎస్‌సి నోటిఫికేష‌న్ ఇవ్వాలి
ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో  20,000 వేల‌కు పైగా ఖాళీలకు నియామ‌కాలు చేప‌ట్టాలి. రెవెన్యూ శాఖలో 740 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. టిడిపి ప్రభుత్వ హ‌యాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగుల‌కిచ్చిన 2000 నిరుద్యోగ భృతిని తక్షణమే అందించాలి. అర్ధరాత్రి ఆత్మలతో మీటింగ్లు ఆపి ఉదయం నిరుద్యోగుల సమస్యల పై సమీక్షా సమావేశం పెట్టాలి. జూన్ 28 న నెల రోజుల గడువు ఇస్తూ డిమాండ్లు పరిష్కరించాలి అని ముఖ్యమంత్రికి లేఖ రాసాను. ఇచ్చిన గడువులోపు డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం'' అని లోకేష్ హెచ్చరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios