భద్రత పేరుతో సీఎం జగన్ నివాసం సమీపంలో ప్రొక్లయినర్లతో పెకిలించిన భరత మాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలి మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. 

అమరావతి: రహదారి విస్తరణ పేరుతో తాడేపల్లి సీఎం జగన్ నివాసం సమీపంలోని భరతమాత విగ్రహాన్ని తొలగించడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులను తాలిబన్లతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేసారు జగన్ రెడ్డి. ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనం'' అని లోకేష్ విరుచుకుపడ్డారు. 

''భద్రత పేరుతో ప్రొక్లయినర్లతో పెకిలించిన భరత మాత విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్టించాలి. చేసిన మూర్ఖపుపనికి వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి యావత్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

read more ఆడపిల్లల ఉసురు మీకు మంచిది కాదు: సీఎం జగన్ పై లోకేష్ సీరియస్

ఇక గుంటూరు దళిత యువతి రమ్య హత్యపైనా జగన్ సర్కార్ ను నిలదీశారు లోకేష్. ''7 రోజుల్లో ద‌ర్యాప్తు, 14 రోజుల్లో కోర్టు విచార‌ణ‌, 21 రోజుల్లో ఏకంగా ఉరిశిక్ష విధించేలా దిశ చ‌ట్టం రూపొందించామంటూ వైఎస్ జగన్ గారు పాలాభిషేకాలు చేయించుకున్నారు. అయితే ఆ చ‌ట్టం అస‌లు కార్య‌రూప‌మే దాల్చ‌లేద‌ని కేంద్రం తేల్చి చెప్పేయ‌డంతో అదో ఫేక్ సీఎం ఇస్తోన్న ఫేక్ జీవోలు...ఫేక్ హామీలు మాదిరిగానే ఫేక్ చ‌ట్టం అని అంద‌రికీ తెలిసిపోయింది. ఇప్ప‌టికీ దిశ‌చ‌ట్టం అంటూ మాయ చేయాల‌ని చూస్తూనే వున్నారు. దిశ‌చ‌ట్టం తెచ్చామ‌ని సొంత మీడియాలో రూ.30కోట్ల‌తో ప‌బ్లిసిటీ చేసుకున్న త‌రువాత వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌లు బ‌లైయ్యారు'' అన్నారు. 

''ఇక 13 రోజులే మిగిలాయి దళిత యువతి రమ్య ని హత్య చేసిన ఉన్మాదిని ఎప్పుడు ఉరి తియ్యబోతున్నారు?'' అంటూ సోషల్ మీడియా వేదికన సీఎం జగన్, వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్.