వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా తాజాగా లోకేష్ వైఎస్ భారతి పేరును తెరపైకి తీసుకువచ్చారు.
అమరావతి: మాజీ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (ys jagan) సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి (ys viveka murder) దారుణ హత్య ఏపీ రాజకీయాను హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ హత్య వైఎస్ కుటుంబసభ్యుల పనేనని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సిబిఐ విచారణలో ఒక్కోటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్న సమయంలో టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తాజా వ్యాఖ్యలు మరింత అలజడి రేపారు. సీఎం జగన్ భార్య భారతీ రెడ్డి పై కూడా లోకేష్ (nara lokesh) అనుమానాలు వ్యక్తం చేసారు.
''వైఎస్ వివేకాకి హత్య చేయించింది అబ్బాయి అని తేలిపోయింది. ఇక తేలాల్సింది ఏ అబ్బాయ్ అనేది మాత్రమే. వివేకా హత్యపై ఒపీనియన్ పోల్ పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. వివేకా హత్య వెనుక ఉన్నది ఎవరు? A) అవినాష్ రెడ్డి, B) జగన్ రెడ్డి, C) భారతీ రెడ్డి, D) పైన ఉన్న వారందరూ... అని పోల్ పెడితే ప్రజలే తేల్చేస్తారు హంతకులు ఎవరో..'' అంటూ లోకేష్ సంచలన కామెంట్స్ చేసారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలియజేసిన అనంతరం లోకేష్ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. బాబాయ్ పై గొడ్డలిపోటుని గుండెపోటు అని శవరాజకీయం చేసింది... తండ్రి శవం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి... ఇప్పుడేమో కల్తీ సారా మరణాలను సహజ మరణాలు అంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. శవరాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాoడ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేసారు.
''పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయింది. మనకు తెలిసి చనిపోయింది 25మందే, తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య తేలాలి. మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా?'' అని లోకేష్ మండిపడ్డారు.
ఇదిలావుంటే అనుమాస్పద మరణాలు సంభవించిన జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే పర్యటించారు. ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిందని... అయితే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని విమర్శించారు.
కల్తీ సారాను వైసీపీ నేతలే విక్రయిస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మద్యం పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కల్తీ సారాతో 26 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కల్తీ సారాతో మరణిస్తే.. ప్రభుత్వం సహజ మరణాలనడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున మరణించిన 26మంది కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
