తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుపై జరిగిన రాళ్ల దాడిపై ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఇది ఖచ్చితంగా వైసిపి ప్యాక్షన్ కుక్కల పనేనంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.  

''ఇదే తిరుప‌తి కొండ‌పైన స్మ‌గ్ల‌ర్లు, తీవ్ర‌వాదుల‌తో క‌లిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే సాక్షాత్తు ఏడుకొండ‌ల‌వాడే కాపాడిన ప్రాణం చంద్ర‌బాబు గారిది. ఏ ఒక్క‌రూ బ‌తికే అవ‌కాశంలేని దాడి నుంచి తేరుకుని స‌హ‌చ‌రులు ఎలా ఉన్నారని వాక‌బు చేసిన‌ గుండె ధైర్యం చంద్ర‌బాబు గారిది'' అని లోకేష్ ట్వీట్ చేశారు.  
 
''నీలాంటి ఫ్యాక్ష‌న్ కుక్క‌ మూతిపిందెలు వేసే రాళ్లు ఆయ‌నని భ‌య‌పెట్టలేవు. జ‌గ‌న్‌ నీ ప్రిజ‌న‌రీ బుద్ధితో రాళ్లేయిస్తే, అదే రాళ్ల‌తో జ‌నానికి ప‌నికొచ్చే ఒక‌ నిర్మాణం చేయించ‌గ‌ల విజ‌న‌రీ చంద్ర‌బాబు గారు. తిరుప‌తిలో నా స‌వాల్ కి తోక‌ముడిచి తొలి ఓట‌మి అంగీకరించావ్. చంద్ర‌బాబు గారి స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని ఓర్వ‌లేక నీ రౌడీమూక‌ల‌తో రాళ్ల దాడి చేసి రెండో ఓట‌మిని ఒప్పుకున్నావు వైఎస్ జగన్!'' అని విరుచుకుపడ్డారు. 

read more   తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు

మరోవైపు చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై రాష్ట్ర గవర్నర్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్దమయ్యింది. ఇందుకోసం ఇప్పటికే టిడిపి నాయకులు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. ఈ విషయమై నిన్న రాత్రే గవర్నర్ కి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల లేఖ రాసారు. ఈక్రమంలో ఇవాళ గవర్నర్ ని కలిసి చంద్రబాబు ప్రచారం సందర్భంగా జరిగిన రాళ్ళ దాడి వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు టీడీపీ నేతలు.

ఇక నేడు టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై ఫిర్యాదు చేయనున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కేంద్ర బలగాలతో నిర్వహించాలని టిడిపి ఎంపీలు కోరనున్నట్లు  తెలుస్తోంది.