ఆంధ్ర ప్రదేశ్ లోొ సంచలనం సృష్టించిన శ్రీ సత్యసాయి జిల్లా బి ఫార్మాసి విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతిపై మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసు మరోమలుపు తిరిగింది. ఇప్పటివరకు యువతిపై అత్యాచారం జరగలేదని చెబుతూవచ్చిన పోలీసులు తాజాగా ఈ కేసును దిశా పోలీస్ స్టేషన్ కు బదిలీచేసారు. ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని దిశా డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ రాహుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు, వైసిపి ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు.
''ముఖ్యమంత్రి గారూ! బి ఫార్మసి స్టూడెంట్ తేజస్విని హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడం ముమ్మాటికీ మీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ ని తప్పించే ఎత్తుగడే. తమ బిడ్డని రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డిఎస్పీ తేల్చేసింది మీ కళ్లల్లో ఆనందం కోసమేనని అర్థమవుతోంది. నిన్నటి సూసైడ్ నేటి రేప్ గా ఎలా మారింది జగన్ రెడ్డి గారు! ఇది యాగీ చేయడం కాదు. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా?'' అని లోకేష్ నిలదీసారు.
తిరుపతిలో బి ఫార్మసి చదువుతున్న తమ కూతురు శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయం పొలంలో సూసైడ్ చేసుకోవడమేంటని మొదటినుండి తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని... గ్యాంగ్ రేప్ కు పాల్పడి అది దారుణంగా చంపివుంటారని వారు అనుమానం వ్యక్తం చేసారు. ప్రేమ పేరుతో వెంటపడి... మాయమాటలతో లోబర్చుకున్న సాదిక్ తన స్నేహితులతో కలిసి ఇదంతా చేసాడని తేజస్విని తల్లిదండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు.
అయితే పోలీసులు మాత్రం తేజస్వినిది ఆత్మహత్యేనని తేల్చారు. ఒక్కసారి కాదు తేజస్విని తల్లిదండ్రులు, బంధువుల ఒత్తిడితో రెండుసార్లు పోస్టుమార్టం నిర్వహించినా ఆమెది ఆత్మహత్యేనని డాక్టర్లు తేల్చారు. అయినప్పటికి మృతురాలి కుటుంబసభ్యులు సమగ్ర విచారణకు పట్టుబట్టడంతో ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీచేసారు.
ఇప్పటికే స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆత్మహత్యగా కేసు నమోదు చేయగా.. మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రమే సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు సాదిక్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది...
తిరుపతిలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదివే తేజస్విని మే 4వ తేదీన గోరంట్ల సమీపంలోని తన ప్రేమికుడు సాదిక్ వ్యవసాయ భూమిలోని షెడ్డులో అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె షెడ్డులో ఉరి వేసుకుని మృతిచెందినట్టుగా పోలీసులు గుర్తించారు. తేజస్విని, సాదిక్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ధర్మవరం డీఎస్పీ చెప్పారు. బాలికను సాదిక్ తన వ్యవసాయ భూమికి తీసుకెళ్లాడని.. ఇద్దరూ అక్కడ ఉన్న షెడ్ వద్ద రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సాదిక్ ఇద్దరికీ భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్లగా.. కి తేజస్విని షెడ్డు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. అయితే తేజస్విని కుటుంబ సభ్యులు మాత్రం అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపిస్తున్నారు.
కుటుంబ సభ్యుల అనుమానం, రాజకీయ విమర్శల నేపథ్యంలో.. తేజస్విని మృతదేహానికి శుక్రవారం పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత తేజస్వినిది ఆత్మహత్యేనని, అత్యాచారం, హత్య జరిగిన దాఖలాలు లేవని డాక్టర్లు చెప్పారు. మృతురాలు మెడపై గాయం గుర్తులు ఉన్నాయని చెప్పారు. శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కూడా వైద్యులు చెప్పిన విషయాన్ని ధ్రువీకరించారు.
అయితే కుటుంబ సభ్యులు మాత్రం నిష్పాక్షంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజస్విని కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ, జనసేన సహా పలు ప్రతిపక్ష పార్టీ నేతలు.. ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. తేజస్విని కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చేలా నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆందోళనకారులు ఎస్పీ వాహనాన్ని ముందుకు కదలనిచ్చారు. ఈ క్రమంలోనే తేజస్విని మృతి కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీచేసారు ఎస్పీ రాహుల్ దేవ్.
