అమరావతి : ఏపీ సీఎం వైయస్ జగన్ పై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. విజయనగరం జిల్లాలో విద్యార్థులపై లాఠీఛార్జ్ ఘటనను ప్రస్తావిస్తూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తే వారిని పోలీసుల బూటు కాళ్లతో తన్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇన్నాళ్లు మీ ఇంటిదగ్గరే 144సెక్షన్‌ అనుకున్నాం. కానీ రాష్ట్రమంతా అమలు చేస్తున్నారుగా! అంటూ సెటైర్లు వేశారు. వరదలొచ్చి ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో అమెరికా పర్యటనకు వెళ్లిపోయారంటూ విమర్శించారు. 

విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిలు ఇవ్వాలంటే వారిని పోలీసుల బూటుకాళ్లతో తన్నిస్తారా? విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి వారిపై అమానుషంగా ప్రవర్తిస్తారా అంటూ నిలదీశారు. 

విద్యార్థుల సమస్యలను తీర్చాలని బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు నారా లోకేష్. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

"మేము మీకు అన్యాయం చేస్తాం. మీరు మాత్రం ఆందోళన చేయడానికి వీల్లేదు" అనే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా చూస్తోంది దేశం అంటూ ఘాటుగా విమర్శించారు. ఆశా కార్యకర్తలు ఆందోళన చేస్తే వాళ్ల కుటుంబసభ్యుల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బెదిరిస్తారా? ఇప్పుడు విద్యార్థుల పట్ల ఇలా కర్కశంగా వ్యవహరిస్తారా?’ అని లోకేశ్‌ ట్విటర్‌లో జగన్ పై విరుచుకుపడ్డారు.