మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు ఏం చేసారో...ఇకపై ఏం చేయనున్నారో వివరించారు.
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. మంగళగిరిలోకి టిడిపి కార్యాలయంలో ఈ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం మరింత కష్టపడి పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
''తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే. రాష్ట్రంలోనే కాదు దేశవిదేశాల్లో ఏ మూలన ఉన్నా ఎత్తిన పసుపుజెండాలు దించకుండా కార్యకర్తలంతా పోరాడుతున్నారు. టిడిపి జెండా కోసం 70ఏళ్ల వృద్ధుడు తొడకొట్టి, మీసం తిప్పాడు... అదీ టీడీపీ కార్యకర్త పౌరుషమంటే. అన్నఎన్టీఆర్ మనకు రాముడు అయితే చంద్రబాబు మనకు దేవుడు'' అని లోకేష్ పేర్కొన్నారు.
''కార్యకర్తలను అన్నిరకాలుగా ఆదుకోవడానికే సభ్యత్వనమోదుకి శ్రీకారం చుట్టాము. వరల్డ్ బ్యాంక్ లో, హెరిటేజ్ లో, మంత్రిగా పనిచేసినా కలగని సంతృప్తి, సంతోషం టీడీపీ కార్యకర్తల విభాగం సమన్వయకర్తగా పనిచేసినప్పుడు కలిగాయి. 2004లో పార్టీ ఓడిపోయాక అప్పుడున్న ప్రభుత్వం ఫ్యాక్షనిజంతో పెద్దఎత్తున రాష్ట్రంలో దాడులకు పాల్పడింది. దాదాపు 167 మంది పార్టీకార్యకర్తల్ని అతికిరాతకంగా హతమార్చారు. ఇలా పార్టీకోసం ప్రాణాలర్పించిన వారి పిల్లల భవిష్యత్ కోసం ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ని చంద్రబాబు ప్రారంభించారు. ఎంతోమంది విద్యార్థులు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఇప్పటివరకు విద్యనభ్యసించారు... 1500మంది ఇప్పటికీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు'' అని లోకేష్ తెలిపారు.
''కార్యకర్తలు ప్రమాదవశాత్తూ చనిపోతే ప్రమాదబీమా కింద వారి కుటుంబాలకు రూ.2లక్షలు అందిస్తున్నాం. గత 8ఏళ్లలో 4,844 మంది కార్యకర్తలు ప్రమాదాల్లో చనిపోతే, రూ.96కోట్ల88లక్షల ప్రమాదబీమా అందించిన ఏకైకపార్టీ తెలుగుదేశం పార్టీనే. కార్యకర్తలకు స్వయం ఉపాధి, వారి పిల్లల చదువుల నిమిత్తం రూ.20కోట్లను పార్టీ సంక్షేమ విభాగం ద్వారా ఆదుకున్నాము. 1982 నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకు ప్రతినెలా పింఛన్లద్వారా 35లక్షలవరకు చెల్లించాము'' అని తెలిపారు.
''2019 నుంచి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టిన దొంగకేసుల నుంచి వారిని బయటపడేయడానికి న్యాయసహాయంకోసం రూ.7కోట్లు ఖర్చుపెట్టాము. ఇలా కార్యకర్తల సంక్షేమంలో భాగంగా ఇదివరకు 1.O చూశాము...ఇకనుంచీ 2.O కొత్తవెర్షన్ చూడబోతున్నాం. కార్యకర్తలు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి అధికప్రాధాన్యత ఇచ్చేలా కొత్తగా తీసుకునే సభ్యత్వనమోదు కార్డుల్ని తీర్చిదిద్దాము. తొలుత సభ్యత్వాన్ని పుస్తకాల్లో, తరువాత కంప్యూటర్లలో చేశాము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రామ్ ఫీచర్లతో చేయబోతున్నాం. మా కార్యకర్తలకు అండగాఉండేలా టెక్నాలజీని వాడుకుంటుంటే ఈ వేస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. సీఎం జగన్ కి సాంకేతికపరిజ్ఞానం గురించి తెలియనప్పుడు నన్ను అడిగితే చెప్తాను కదా!'' అంటూ ఎద్దేవా చేసారు.
''ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏంచేసినా...ఎన్నికేసులు పెట్టినా పసుపు జెండాను ఏమీ పీకలేరు. 2014-16, 2016-18, 2018-20లలో మూడుసార్లు ట్యాబ్ ల ద్వారా సభ్యత్వనమోదు నిర్వహించాము. ఇప్పుడు 2020-22కి దేశంలో ఏపార్టీ వినియోగించని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వాన్ని నమోదుచేయబోతున్నాం. సభ్యత్వ నమోదుకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ : 9858175175. ఆ నంబర్ కి హాయ్... హలో అని మెసేజ్ పెడితే ఆటోమేటిగ్గా బాట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సభ్యత్వ నమోదు ప్రక్రియ వివరాలు అడుగుతుంది. టెలిగ్రామ్ లో JAI TDP అనే బాట్ వస్తుంది. మూడో మార్గంలో గూగుల్ ప్లే స్టోర్ లో ఉండే మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. టీడీపీకార్యకర్తలమైన మనందరం కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం'' అని లోకేష్ పిలుపునిచ్చారు.
''నాడు-నేడు ఎప్పుడూ టీడీపీ కార్యకర్తలకోసం పనిచేస్తూనే ఉంటుంది. నిరుపేదలైన కార్యకర్తలకోసం పార్టీని అభిమానించే ప్రతిఒక్కరూ ఇతోధికంగా తోచినంత మొత్తం ఆర్థికసాయం అందించాలని కోరుతున్నాం'' అని లోకేష్ తెలిపారు.
