గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసిపి ప్రతిపక్షంలో వుండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట ఆడుతోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ ఆరోపించారు.  స్వయంగా ఆ పార్టీ అధ్యక్షులు జగన్ ప్రతిపక్షంలో వుండగా రాజధాని  గురించి మాట్లాడిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇప్పుడు రాజధాని విషయంలో మాటమార్చడంలో దాగివున్న రహస్యమేంటని జగన్ ను ప్రశ్నించారు లోకేష్. 

 ''రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలట! ఎవరు ప్రయాణం చెయ్యాలన్నా ఇబ్బంది పడకూడదు,దండిగా నీళ్లు ఉండాలి. ఇవి వైఎస్ జగన్ గారి ఆలోచనలు...మరి జే టర్న్ వెనుక రహస్యం ఏంటో?'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు. 

 

''జగన్ గారూ! స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిట‌ల్‌, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్ర‌పంచానికే త‌ల‌మానికంగా న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధానిగా మ‌‌హాన‌గ‌రం క‌డ‌తాన‌ని ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు పలికారు'' అని ఎద్దేవా చేశారు. 

 

''నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘ‌న‌మైన ల‌క్ష్యాల‌తో చంద్ర‌బాబు గారు నిర్మించిన అమ‌రావ‌తి ప్ర‌జా రాజ‌ధానిని ఎందుకు ధ్వంసం చేయాల‌నుకుంటున్నారో  ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. మీరు క‌ట్టాల‌నుకున్న‌ రాజ‌ధాని కంటే గొప్ప‌ది చంద్రబాబు నాయుడు క‌ట్టారని కూల‌గొడుతున్నారా?'' అని నిలదీశారు. 

''అమ‌రావ‌తి నిర్మాత‌గా చంద్ర‌బాబు గారి పేరు చ‌రిత్ర‌లో ఉండ‌కూడ‌ద‌ని మూడు ముక్క‌లాట‌తో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఐదు కోట్ల‌ ఆంధ్రుల‌కు స‌మాధానం చెప్పి తీరాలి'' అంటూ ట్విట్టర్ ద్వారా లోకేష్ డిమాండ్ చేశారు.