మా అమ్మ మీలా వీధి రౌడీలా పెంచలేదు: జగన్ పై నారా లోకేష్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ విరుుచుకుపడ్డారు. జగన్ తెలుగు మాట్లాడడంలోనే కాదు, లెక్కల్లోనూ వీక్ అని నారా లోకేష్ అన్నారు. తనకు తెలుగు రాకపోతే ఏపీకి ఏమైనా నష్టమా అని అడిగారు.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలుగు మాట్లాడడంలోనే కాదు, లెక్కల్లోనూ వీక్ అని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ వ్యాఖ్యానిం్చారు. తెలుగులో ఓ పదాన్ని తాను అటూ ఇటుగా అని ఉండవచ్చునని, తన తెలుగు కారణంగా ఏపీకి ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన అన్నారు.
తనను అవహేళన చేసినా స్పీకర్ ఏమీ అనడం లేదని ఆయన బుధవారం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు తమ పాలనలో అభివృద్ధి వైసీపీకి కనిపించడం లేదని ఆయన అన్నారు. తాము హెరిటేజ్ ఫ్రెష్ ను ఎప్పుడో అమ్మేశామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నో కంపెనీల్లో వాటాలున్నాయని, ఆ కంపెనీలు రేట్లు పెంచితే బుగ్గన బాధ్యత వహిస్తారా అని నారా లోకేష్ అన్నారు.
2012 నుంచి తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన అన్నారు. జగన్ ఆరు నెలల పాలనలో ఉల్లి, ఇసుక, మద్యం, తదితర రేట్లు పెంచారని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని అన్నారు.
తమ అమ్మ తనను క్రమశిక్షణతో పెంచిందని, జగన్ లా వీధి రౌడీలా పెంచలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను పుట్టేనాటికే తన తాత ముఖ్యమంత్రి అని, తాను స్కూల్లో చదవే సమయానికి తన తండ్రి ముఖ్యమంత్రి అని, తనను తన అమ్మ క్రమశిక్షణతో పెంచిందని ఆయన చెప్పారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం కాదని ఆయన అన్నారు.
మంగళగిరి పులివెందుల కాదని, తెలుగుదేశం పార్టీకి మంగళగిరి కంచుకోట కాదని, అక్కడ టీడీపీ జెండా పాతేందుకు తాను పోటీ చేశానని, చరిత్ర తిరగరాసేందుకు పోటీ చేశానని ఆయన చెప్పారు. ఆరు నెలలు గడిచినా అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగినట్లు నిరూపించలేకపోయారని ఆయన అన్నారు..
నెల్లూరులో మాఫియా రెచ్చిపోతుందనే ఆనం మాటలపై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. అన్నీ పెంచుతామని పాదయాత్రలో జగన్ అంటే ప్రజలు నమ్ముతూ పోయారని, ధరలు పెంచుతూ పోతున్నారని ఆయన అన్నారు.