గుంటూరు: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని నాయకులే మోసం చేశారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 10 శాతం ఈవిఎంలు మోసం చేస్తే 90 శాతం నాయకులు మోసం చేశారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఓటమిపై ఆయన ఆ విధంగా మాట్లాడారు.

గల్లా జయదేవ్ వంటి నాయకులే గెలువగా లేనిది మిగతా నాయకులు ఎందుకు ఓడిపోయారని నారా లోకేష్ ప్రశ్నించారు.  ఎన్టీఆర్ మహానాయకుడు అని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చారని ఆయన అన్నారు. ఎన్టీయార్ 97వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులు అర్పించారు.

కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. 2024లో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన చోటే గెలవాలనేది తన సంకల్పమని, ఎమ్మెల్సీగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
సేనాధిపతి చంద్రబాబు అయితే మనమంతా సైనికులమని ఆయన కార్యకర్తలనుద్దేశించి లోకేశ్ వ్యాఖ్యానించారు. 2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.